
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని రుజువు చేస్తున్నాయని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాహభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు అండ్ క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతి అని తెలంగాణ ఇచ్చిన జాతి అని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఇచ్చిన తెలంగాణను అందరూ మెచ్చే తెలంగాణగా తీర్చిదిద్దుతున్న జాతి తమదని మంత్రి వాకిటి పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు విశ్వాసంగా ఉన్న జాతి అని తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న జాతి తమేదనని ఆయన చెప్పారు. తెలంగాణను దోచుకున్న రాబందులను తరిమికొట్టడంతో పాటు తెలంగాణ భవిష్యత్ తరాలకు బాసటగా నిలిచామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
ఎక్కుపెట్టిన తుపాకికి ఎదురుగా నిలబడ్డ ఉద్యమకారుల వెనుక దాక్కున పిరికిపందల జాతి మీదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం కోసం నిలువెల్లా కాలిపోయిన విద్యార్థుల చితిమంటల మీద చలికాచుకున్నది మీరని ఆయన ఆరోపించారు. తెలంగాణ అమరవీరుల సమాధుల మీద గడీలు కట్టుకున్న నికృష్టపు జాతి ఎవరిదో ప్రజలకు తెలుసని మంత్రి వాకిటి అన్నారు. యువకుల బలిదానాల మీద కూర్చొని పంచభక్ష్య పరమాన్నాలు తినడమే కాకుండా తెలంగాణ సంపదను అనకొండలా బిఆర్‌ఎస్ నాయకులు అమాంతం మింగేశారని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారం చూపించినందుకే తెలంగాణ ప్రజల చైతన్యం ముందు చెత్త కుప్పలో పడ్డ విషయాన్ని కెటిఆర్ మరిచిపోవొద్దని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.











