
కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన అడుగును చాలా జాగ్రత్తగా వేయబోతున్నాడు. ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తోన్న 100వ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా నాగార్జున కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా నిలవబోతోంది. అందుకోసం మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాను తమిళ యంగ్ డైరెక్టర్ రా కార్తీక్ తెరకెక్కిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. స్త్రుతం నాగార్జున.. తన 100వ మూనీని ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘కింగ్100’ లేదా ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటించింది.
భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకులలో ఒకరైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా అధికారికంగా చేరారు. నాగార్జున దేవిశ్రీ ప్రసాద్‌లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. నాగార్జున ‘మన్మథుడు’, ‘మాస్’, ‘కింగ్’, ‘కుబేర’ చిత్రాలకు డీఎస్పీ అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మైలురాయి చిత్రానికి కూడా అదే స్థాయి మ్యాజిక్‌ను సంగీతాన్ని అందిస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత నాగార్జున, టబు కాంబినేషన్ మరోసారి 27 ఏండ్ల తర్వాత పునరావృతం అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు డీఎస్పీ ఎంట్రీతో ‘కింగ్ 100’పై అంచనాలు మరింత పెరిగాయి.











