నాగిరెడ్డిపల్లిలో మిషన్ భగీరథ నిర్లక్ష్యం

రెండు నెలలుగా పగిలిన పైప్‌లైన్... బురద నీరే ఇంటింటికీ సరఫరా

అధికారుల నిర్లక్ష్యానికి గ్రామస్తుల ఆరోగ్యమే బలికావాలా?

గ్రామపంచాయతీ–మిషన్ భగీరథ మధ్య బాధ్యతల నెట్టివేతపై ప్రజల ఆగ్రహం

మనతెలంగాణ/భువనగిరి ప్రతినిధి: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోయి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైప్‌లైన్ పగిలిన ప్రాంతంలో వర్షపు నీరు, బురద, మురుగు నీరు కలుషితమై అదే నీరు ఇంటింటికీ సరఫరా అవుతుండటంతో ప్రజలు అంటువ్యాధులు, జ్వరం, కడుపు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యను పలుమార్లు మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ సెక్రటరీని సంప్రదిస్తే "ఇది మిషన్ భగీరథ పైప్‌లైన్, మాకు సంబంధం లేదు" అని చెబుతుండగా, మిషన్ భగీరథ అధికారులు మాత్రం "గ్రామపంచాయతీ చర్యలు తీసుకోవాలి" అంటూ బాధ్యతలను ఒకరిపై మరొకరు నెట్టేస్తున్నారని గ్రామ ప్రజలు మండిపడుతున్నారు.

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం, అధికారుల నిర్లక్ష్యంతో నాగిరెడ్డిపల్లిలో ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అమాయక ప్రజలు వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

ఇప్పటికైనా మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), గ్రామ సెక్రటరీ, మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి పగిలిన పైప్‌లైన్‌ను మరమ్మతు చేసి, గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు.