మన తెలంగాణ/హైదరాబాద్: కల్యాణల క్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర నిలుపుదల ఉత్తర్వులను తొలగించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుకు మార్గం సుగమం చేసింది. అప్పీల్ దాఖలుపై రిజిస్ట్రీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపు చ్చి, దానికి నంబర్ కేటాయించాలని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం 2014 నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబార క్ పథకాల అమలుకు జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు కాకపోవడంతో సింగిల్ జడ్జి పథకాల అమలును నిలిపివేస్తూ మ ధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని స వాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ 

మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం రిజిస్ట్రీ అభ్యంతరాలను కొట్టివేసింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. పథకాలతో ప్రత్యక్షంగా సంబంధం లేని వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. పథకాల అమలు వల్ల ఆయన హక్కులకు ఎలాంటి నష్టం కలగలేదని, పిటిషన్‌ను ప్రజాహిత వ్యాజ్యంగా కూడా పరిగణించలేమని పేర్కొన్నారు. షాదీముబారక్ తరహా సంక్షేమ కార్యక్రమాలకు సుప్రీంకోర్టు అనుమతి ఉన్న విషయాన్ని ఏజీ ప్రస్తావించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను సవాలు చేసే అంశాలపై విచారణ జరిపే అధికారం సింగిల్ జడ్జికి లేదని, అలాంటి వ్యవహారాలను డివిజన్ బెంచ్ విచారించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఈ దశలో ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. రాజ్యాంగంలోని అధికరణ 162 కింద ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టే అధికారాన్ని కలిగి ఉందా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. మహిళలు, బాలికల సంక్షేమానికి సంబంధించి అధికరణ 15(3) కల్పిస్తున్న వెసులుబాటును కూడా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ రాజ్యాంగ నిబంధనల పరిధిలో ప్రభుత్వ అధికారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే స్టే ఎత్తివేత అభ్యర్థనపై తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.