పశ్చిమబెంగాల్ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నవారికి కమలనాథుల గెలుపు అంతగా ఆశ్చర్యం కలిగించి ఉండదు. మూడు దఫాలుగా అధికారాన్ని నిరాఘాటంగా కొనసాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీపట్ల సహజంగానే ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒంటెత్తు పోకడలు, స్వయంకృతాపరాధాలు, రాష్ట్రంలో కొరవడిన శాంతిభద్రతలు వంటి లోటుపాట్లను తనకు అనుకూలంగా మలచుకోవడంలో భారతీయ జనతా పార్టీ నూటికి నూరుపాళ్లూ విజయం సాధించింది. ఒక్కమాటలో చెప్పాలంటే తృణమూల్ లోపాలే బిజెపి గెలుపునకు బాటలు వేశాయంటే అతిశయోక్తి కాదు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బిజెపి వచ్చీరాగానే ప్రజల మన్ననలను చూరగొనేందుకు, రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలను తిరిగి పట్టాలు ఎక్కించేందుకు శ్రీకారం చుడితే బాగుండేది. కానీ తొలి మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే, కమలనాథులకు స్వీయ ఎజెండా అమలే అన్నింటికన్నా ముఖ్యమైనదిగా తోస్తున్నది. బంగ్లాదేశ్ సరిహద్దులలో కంచె నిర్మాణానికి సరిహద్దు భద్రతా దళానికి భూమిని అప్పగించడం, ఆయుష్మాన్ భారత్ సహా ప్రధాన కేంద్ర పథకాలను పశ్చిమ బెంగాల్ లోనూ అమలు చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లకు పెంచడం, కేంద్రం ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలోనూ జనగణన జరిపించడం, రాజకీయ ప్రేరేపిత హింస కారణంగా మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు న్యాయపరంగా అండదండలు అందించడం, రాష్ట్ర ఐఎఎస్, ఐపిఎస్ తదితర క్యాడర్ అధికారులకు కేంద్ర ప్రభుత్వ శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనే వెసులుబాటు కల్పించడం.. ఇవీ సువేందు తొలి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు. పార్టీకోసం ప్రాణాలు అర్పించిన 321 మంది అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి సువేందు ప్రకటించడం విడ్డూరం. రాజకీయ హింసలో కేవలం బిజెపి కార్యకర్తలే అసువులు బాసారా, తృణమూల్ కార్యకర్తలు లేరా? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారి కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? శాంతిభద్రతలను గాడిన పెట్టే దిశగా తొలి మంత్రివర్గంలో ఏ ఒక్క నిర్ణయమూ లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. తృణమూల్ హయాంలో బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు పెరిగిపోయాయన్న మాట వాస్తవమే కావచ్చు. కానీ కొంపలేవో మునిగిపోతున్నట్లు కంచె నిర్మాణంపై అధికారంలోకి వచ్చీరాగానే నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏముంది? వాస్తవానికి బంగ్లాదేశ్- బెంగాల్ మధ్య నాలుగు వేల కిలోమీటర్ల పొడవునా సరిహద్దు ఉంటే, మూడువేల కిలోమీటర్లకు పైగా కంచె నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇక మిగిలిన సుమారు 800 కి.మీ మేర మాత్రమే కంచె నిర్మించవలసి ఉంది. ఈ కొద్దిమేర కంచె నిర్మాణం ముందుకు సాగకపోవడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనడంలోనూ సందేహం లేదు. అయితే అసలు సమస్యలను పక్కనబెట్టి, ఎన్నికల్లో హామీ ఇచ్చాం కదా అని వాటి అమలుకే నడుం బిగించడం సమంజసం అనిపించుకోదు. బెంగాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు ఎన్నికలకు ముందునుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, తృణమూల్‌ను ఎక్కడికక్కడ నిలువరిస్తూ వచ్చారు. ఐప్యాక్‌పై ఇడితో దాడులు జరిపించడం, టిఎంసికి అనుకూలురైన అధికారులను బదిలీ చేయించడం, కనీవినీ ఎరుగని రీతిలో కేంద్ర బలగాలను మోహరించడం వంటివి ఈ కోవలోకే వస్తాయి. అయితే అధికారాన్ని చేజిక్కించుకున్నాక జనరంజకమైన పాలన అందించడం ద్వారా తమపై ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్ముకాకుండా చూసుకోవాలి. కానీ అధికార పార్టీ ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు కనిపించడం లేదు. మొట్టమొదటిసారి బెంగాల్‌లో పాగా వేశామన్న సంతోషంలో కమలనాథులు రాష్ట్రంలో ఏం జరుగుతోందో చూసే స్థితిలో లేరు. ఫలితాలు వెల్లడైన రోజునుంచే తృణమూల్ పార్టీ కార్యాలయాలపైనా, కార్యకర్తలపైనా దాడులు మొదలయ్యాయి. పార్టీ కార్యాలయాలను కొన్నిచోట్ల ధ్వంసం చేస్తే, మరికొన్నింటికి కాషాయ రంగు పులిమి స్వాధీనం చేసుకున్నారు. ఇక తమ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రమైన ఇడి, సిబిఐ వంటివాటినీ వెలికి తీస్తున్నారు. ముఖ్యమంత్రి సువేందుకు మొన్నటివరకూ పిఎగా పనిచేసిన చంద్రనాథ్ హత్య కేసును సిబిఐకి అప్పగించారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై తృణమూల్‌కు చెందిన మాజీ మంత్రి సుజిత్ బోస్‌పై ఇడిని ప్రయోగించి, అరెస్టు చేయించారు. ఇవన్నీ చూస్తే ప్రతీకార చర్యలకు బిజెపి తెర తీసిందని అనిపించదా? మమతా బెనర్జీ నియంత పోకడలను భరించలేకే ప్రజలు తమకు పట్టంగట్టారన్న వాస్తవాన్ని విస్మరించి, తాము కూడా అదే బాటలో నడిస్తే, ఇవాళ గెలిపించిన ప్రజలే రేపు కర్రు కాల్చి వాతబెడతారు. తస్మాత్ జాగ్రత్త!