ఐపిఎల్ 2026లో భాగంగా బుధవారం(మే 20) జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర ఓటమి పాలైన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిసిసిఐ బిగ్ షాకిచ్చింది. మ్యాచ్‌లో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పాండ్యాకు..మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినందుకు హార్దిక్‌ను దోషిగా నిర్ధారించారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోని 10వ ఓవర్‌ వేస్తున్న క్రమంలో హార్దిక్ పాండ్యా నాలుగో బంతి వేసి.. రన్-అప్‌కు తిరిగి వెళ్తూ వికెట్ బెయిల్స్‌ను పడగొట్టాడు. దీంతె హార్దిక్ పాండ్యాకు అతని మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా విధించారు.

 కాగా, మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబై.. ఇన్నింగ్స్ ఆరంభం క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివర్లలో బాష్(18 బంతుల్లో 32 పరుగులు) ధనాధన్ షాట్లతో చెలరేగాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెకెఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ముంబై జట్టుకు 4 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. కాగా, ముంబై జట్టు ఇప్పటికే టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో కెకెఆర్, ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.