
మన తెలంగాణ/హైదరాబాద్: మంత్రి పదవి నుంచి బర్తరప్కు గురైన కొండా సురేఖ దారి ఎటు వైపు? అనే చర్చ రాజకీయవర్గా ల్లో జరుగుతున్నది. ఆమె ఫలా నా పార్టీలో చేరేందుకు రంగం చేసుకున్నదని, ఆ పార్టీ నేతలతో మంతనాలు కూడా జరిగాయన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. అ యితే ఆమె రెండు రోజుల వర కూ ఎవరితో మాట్లాడకుండా గుంభనంగా ఉంటూ రాజకీయ ఎత్తుగడకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు ఆమె సన్నిహితవర్గాల ద్వారా తెలుస్తోంది. వదంతుల సంగతి ఎలా ఉన్నా, బిఆర్ఎస్ ముఖ్య నా యకుడైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఆమె ను తమ పార్టీలో చేర్చుకునే ప్ర సక్తి లేదని తేల్చి చెప్పారు. గ తంలో ఆమె బిఆర్ఎస్ నుంచే కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆమె ఆ పార్టీలోకి వె ళ్ళాలన్న ఆలోచన చేశారో లే దో తెలియక ముందే ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఖండితంగా చెప్పడం గమనార్హం. ఇక పిసిసి అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ బి.మహేష్ కుమార్‌గౌడ్ శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కొండా సురేఖ తమ పార్టీలోనే కొనసాగుతారని కీలక ప్రకటన చేశారు. కొం డా సురేఖ పట్ల ఆయన కొంత సానుకూలంగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
కొండా సురేఖపై తమకు వ్యక్తిగతంగా కోపం లేదని, తన కుమార్తె వ్యాఖ్యలను ఆమె వెంటనే ఖండించి ఉంటే సమస్య ఉత్పన్నం అయ్యేది కాదన్న అభిప్రాయాన్ని మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తం చేశారు. కొండా సురేఖ జనసేన పార్టీలో చేరనున్నారా? అనే చర్చ కూడా జరుగుతున్నది. తెలంగాణలో జనసేన ప్రాబల్యం పెద్దగా లేకపోయినప్పటికీ, ఆమె ఆ పార్టీని బలోపేతం చేసేందుకు తన భుజస్కందాలపై వేసుకుంటారా? అనేది కూడా మీమాంస. జనసేన వల్ల పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ, కులసమీకరణల నేపథ్యంలో ఇతర ప్రధాన పార్టీల బలాలను దెబ్బ తీసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఆమె నిజంగానే జనసేన పార్టీ బలపేతం చేయడాన్ని తన భుజస్కందాలపై వేసుకుంటే రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలతో భవిష్యత్తు తేలిపోతుందని చెప్పవచ్చు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం లేకపోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌లో తప్ప తెలంగాణలో కనీసం శాఖలు లేవు, పార్టీకి అధ్యక్షుడు కూడా లేరు.
అటువంటి పార్టీలోకి ఆమె ఎందుకు వెళతారన్న సందేహాలు ఉన్నాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని ఆమె తీసుకుంటారన్న ప్రచారానికి బలమైన కారణం ఉంది. పదిహేడు సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. వైఎస్ మంత్రివర్గంలో ఉన్న కొండా సురేఖ వైఎస్ మరణంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తదుపరి సీఎంగా వైఎస్ తనయుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వైఎస్ లేని మంత్రివర్గంలో తాను ఉండనంటూ రాజీనామా చేశారు. తర్వాతి కాలంలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు మహబూబాబాద్‌లో జగన్ రాకను అడ్డుకోవడం, రాళ్ళు రువ్వడం వంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆమె నోచ్చుకుని, ఒకదశలో ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇలా వైఎస్ జగన్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరువు బాధ్యతలను తీసుకుంటారా? అనేది చర్చనీయాంశంగా ఉంది.
ఇక మిగిలింది బిజెపినే..
రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. కాగా కొండా సురేఖను పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ నుంచి విమర్శలు ఎదుర్కొవడమే కాకుండా జిల్లా పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందన్న భయం ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. కొండా సురేఖ నుంచి ప్రతిపాదన వచ్చినప్పుడు ఆలోచిస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. బిసి మహిళ అయిన కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని బిజెపి ఎంపీ డికె అరుణ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు దొర్లుతుంటాయి, వాటిని సరి చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుందని ఎంపీ అరుణ వ్యాఖ్యానించారు. ఈ ఊహగానాలు ఎలా ఉన్నా ఆమె మరో రెండు రోజుల పాటు మౌనంగా ఉంటారని తెలుస్తోంది.











