
కూకట్ పల్లి: మహిళా కానిస్టేబుల్ ను ఎస్ఐ ప్రేమపేరుతో మోసం చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు ఎస్ఐని సస్పెండ్ చేశారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ లో 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సీ సురేష్ కుమార్ ఎస్సె గా పని చేస్తున్నారు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ తో పరిచయం కావడంతో ఇద్దరు మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళ కానిస్టేబుల్ ను ఎస్ఐ శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో ఏవో సాకులు చెబుతూ తప్పించుకున్నాడు. ఈ మధ్య పెళ్లి విషయంలో ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీంతో ఎస్సై సురేష్ తనను మోసం చేయడానికి యత్నిస్తున్నట్లు అనుమానించిన మహిళా కానిస్టేబుల్ గట్టిగా నిలదీసింది. దీంతో ఆమెపై సురేష్ ఎదురుతిరిగాడు. పెళ్లి చేసుకోవడం కుదరదని సురేష్ తేల్చి చెప్పాడు. దీంతో అతనిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు ఎస్ఐ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో బాధిత యువతి ఇచ్చిన ఆధారాలతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు.













