
జగిత్యాల: కోరుట్ల బస్టాండ్‌లో నిలిపిన ఆర్‌టిసి బస్సును ఓ వ్యక్తి ఆపహరించిన సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల డిపోకు చెందిన టిఎస్ 08 జడ్ 0103 అనే నంబరు గల బస్సుకు ప్రవీణ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కోరుట్ల బస్టాండ్‌లోని 8వ నంబరు ప్లాట్ ఫాంపై బస్సును నిలిపి డ్రైవర్ వాష్ రూమ్ కు వెళ్లాడు. ఓ దుండగుడు బస్సు అపహరించి నిజామాబాద్ వైపు వెళ్లాడు. డ్రైవర్ వెంటనే గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే జీపులో బస్సును పట్టుకునేందుకు వెళ్లారు. ఆగంతకుడు రోడ్డుపై బైక్‌లను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లాడు. పలువరు ద్విచక్రవాహనదారులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి ముందుకు వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో గండి హనుమాన్ సమీపంలో రోడ్డుకు లారీని నిలిపి ఉంచారు. దీంతో బస్సు ముందుకు వెళ్లే దారి లేకి ఓ చెట్టును ఢీకొట్టి అనంతరం బస్సు ఆగిపోయింది. 18 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత బస్సును పోలీసులు పట్టుకున్నారు. ఆగంతకుడు పారిపోతుండగా పోలీసులు అతడిని పట్టుకొని విచారిస్తున్నారు.











