కొత్త స్కూటీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్! టీవీఎస్ తన జనాదరణ పొందిన జూపిటర్ 125ను మరింత స్టైలిష్‌గా మార్చేందుకు రెండు కొత్త అందమైన రంగులలో విడుదల చేసింది. భారత మార్కెట్లోనే హోండా యాక్టివా తర్వాత అత్యధికంగా అమ్ముడయ్యే ఈ రెండవ మోడల్ జూపిటర్..హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125, హీరో డెస్టినీ 125 వంటి స్కూటర్లతో నేరుగా పోటీపడుతుంది. కొనుగోలుదారుల విభిన్న అభిరుచులకు అనుగుణంగా టీవీఎస్ జూపిటర్ 125 అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో డ్రమ్-అల్లాయ్, డిస్క్, డీటీ ఎస్‌ఎక్స్‌సీ, టాప్-స్పెక్ స్మార్ట్‌కనెక్ట్ ఉన్నాయి. కంపెనీ 'ఐవరీ మ్యాట్ కాపర్ బ్రాంజ్', 'ఐవరీ ఎలైట్ గ్రీన్' అనే రెండు కొత్త రంగులను విడుదల చేసింది. ముఖ్యంగా, ఈ రెండు కొత్త షేడ్స్ కేవలం జూపిటర్ 'డీటీ ఎస్‌ఎక్స్‌సీ' వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

టీవీఎస్ జూపిటర్ 125 కొత్త 'డీటీ ఎస్ఎక్స్సీ' వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.86,750. నివేదికల ప్రకారం, ఈ వేరియంట్‌లోని అన్ని రంగులు ఈ ధరకే లభిస్తాయి. అత్యంత చౌకైన జూపిటర్ 125 మోడల్ 'డ్రమ్-అలాయ్'. ఇది ఇండిబ్లూ, వైట్, టైటానియం గ్రే అనే మూడు రంగులలో వస్తుంది. టాప్-స్పెక్ 'డిస్క్' వేరియంట్ ధర రూ.83,900. అత్యంత అధునాతన ఫీచర్లను అందించే టాప్-స్పెక్ స్మార్ట్‌కనెక్ట్ వేరియంట్ ధర రూ.89,060 నుండి ప్రారంభమవుతుంది.

టీవీఎస్ జూపిటర్ 125లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌కు కనెక్ట్ చేసి, డిజిటల్ స్క్రీన్‌పై టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్&మెసేజ్ అలర్ట్‌ల వంటి సమాచారాన్ని చూడవచ్చు. అంతేకాకుండా ఫ్యూయల్ ట్యాంక్ ముందు భాగంలో ఉండటం వల్ల తరచుగా సీటు దిగాల్సిన అవసరం ఉండదు. మరోవైపు..రెండు హెల్మెట్‌లను సులభంగా ఉంచడానికి సరిపడా పెద్ద బూట్ స్పేస్‌ను ఇది అందిస్తుంది. సౌకర్యం, భద్రత కోసం..అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్, సౌకర్యవంతమైన పొడవైన సీటు, ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఒక USB పోర్ట్ వంటి అవసరమైన అన్ని ఫీచర్లను అందుబాటులో ఉన్నాయి.