కరీంగనర్: మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ లో జరిగిన దోపిడీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. న్యూఢిల్లీ నుండి కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు కేంద్ర మంత్రి సంజయ్ ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నాడు.  దోపిడీ దొంగలపై ఉక్కుపాదం మోపాలని సిపిని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుల కోసం క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయని సిపి చెప్పారు. విచారణను ముమ్మరం చేశామని, నిందితులను అదుపులోకి తీసుకుంటామని సిపి చెప్పారు.

కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్ చౌరస్తాలో ఓ ఇంట్లో అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఎనిమిది మంది సాయుధ దుండగులు ఇంట్లోకి చొరబడి సుమారు 66 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.21 లక్షల నగదును దోచుకెళ్లారు. అలాగే ఇంటి కింద పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను కూడా అపహరించిన విషయం తెలిసిందే.