
ఇంటి ముందు చిన్నారి పాపతో కలిసి బైఠాయింపు..!
రెండో పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడంటూ కన్నీరు.. న్యాయం చేయాలని డిమాండ్
మన తెలంగాణ/సైదాపూర్: మాయమాటలతో తనను నమ్మించి,జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త.. మరో మహిళ మోజులో పడి తనను,తన కన్న బిడ్డను రోడ్డున పడేశాడంటూ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి గ్రామానికి చెందిన ఈరాల మేఘన రోదిస్తూ తన భర్త ఇంటి ఎదుట బైఠాయించి మంగళవారం ధర్నాకు దిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన మేఘనను సైదాపూర్ మండలం వెన్కేపల్లికి చెందిన ఈరాల రాజు అనే వ్యక్తితో 2022లో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో కట్న కానుకలతో వివాహం జరిపించారు.వీరికి ఒక చిన్నారి కూతురు క్రిత్యశ్రీ(3) జన్మించింది.పెళ్లికి ముందే రాజు మరో యువతీతో ప్రేమాయణం నడిపించాడని,ఇదంతా తెలిసి తనతో పెళ్లి చేయించి తనను,తన కుటుంబాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నారని మేఘన రోధించారు.
భర్త ప్రవర్తనలో మార్పును గమనించి భర్తను నిలదీయాగ భార్యాపిల్లలను నిర్లక్ష్యం చేస్తూ, మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారని తెలిపారు.ఈ క్రమంలోనే సదరు భర్త..భార్యకు తెలియకుండా రహస్యంగా మరో మహిళను వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపింస్తుంది.రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తమను పూర్తిగా వదిలేసి హైదరాబాదులో రహస్యంగా జీవిస్తున్నారని, విషయం తెలిసి తన తండ్రి గుండెపోటుతో మృతి చెందారని మేఘన కన్నీరుమున్నీరైంది.పంచాయతీలు పెట్టి ప్రజాప్రతినిధులు,కులపెద్దలు చెప్పినా తన భర్త రాజు వినక పోవడంతో.. విసిగిపోయిన బాధితురాలు తన చిన్నారి కూతురిని ఎత్తుకుని భర్త నివాసం ఉంటున్న ఇంటి ముందుకు చేరుకొని ధర్నాకు దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదంటూ తన కుటుంబ సభ్యులతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.చిన్నారితో కలిసి తల్లి ఇంటి వద్ద ధర్నా చేయడం చూసి స్థానికులు అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు న్యాయం చేయాల్సిన పోలీసులు తనపై, తమ కుటుంబ సభ్యులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు.ఇట్టి విషయమై బాధితురాలి భర్త రాజును వివరణ కోరగా తాను అందుబాటులో లేనని తాను ఎవరిని వివాహం చేసుకోలేదని,తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.











