66 తులాల బంగారం, రూ.21 లక్షల నగదు అపహరణ

కుటుంబ సభ్యులను బంధించి.. రెండు బైకులతో పరారైన దుండగులు

కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్ చౌరస్తాలో ఓ ఇంట్లో అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఎనిమిది మంది సాయుధ దుండగులు ఇంట్లోకి చొరబడి సుమారు 66 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.21 లక్షల నగదును దోచుకెళ్లారు. అలాగే ఇంటి కింద పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను కూడా అపహరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అర్ధరాత్రి సమయంలో ఇంటి యజమాని బయట లైట్ ఆఫ్ చేసేందుకు రాగా, వెనుక నుంచి వచ్చిన దుండగులు అతడిని అదుపులోకి తీసుకుని బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న వృద్ధులతో సహా నలుగురు కుటుంబ సభ్యులను కత్తులు, తుపాకులతో బెదిరించి సుమారు గంటన్నర పాటు కట్టేసి ఉంచారు. బాధితుల అరుపులు బయటకు వినిపించకుండా టీవీ శబ్దాన్ని భారీగా పెంచిన దుండగులు వారి మెడలోని గొలుసులు, చేతి ఉంగరాలు, చెవి కమ్మలు కూడా లాక్కెళ్లారు. అనంతరం రూ.21 లక్షల నగదు, 66 తులాల బంగారం, వెండి వస్తువులతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.