
భారత్‌లో క్రీడలంటే ఇప్పటికీ చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది క్రికెట్ మాత్రమే. ఆ ఆట దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించింది. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించింది. అయితే ఒక పరిపక్వ క్రీడా దేశం ఒక్క ఆటపైనే ఆధారపడకూడదు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్‌కు కూడా సమాన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ముంబైలోని చారిత్రక నెవిల్లే డిసౌజా ఫుట్‌బాల్ మైదానాన్ని కన్వెన్షన్ సెంటర్‌గా మార్చే ప్రతిపాదనకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఉద్యమించారు. గువాహటిలోని జనతా భవన్ ఆటస్థలాన్ని పార్కింగ్ స్థలంగా మార్చకుండా కాపాడేందుకు చిన్నారులు, క్రీడాకారులు, వృద్ధులు, స్థానికులు కలిసి ముందుకొచ్చారు. ఇవి రెండు నగరాలకు మాత్రమే పరిమితమైన సంఘటనలు కావు. దేశవ్యాప్తంగా ఆటస్థలాలు క్రమంగా కనుమరుగవుతున్నాయనే వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాయి. ఒక ఫుట్‌బాల్ మైదానం కనుమరుగవడం అంటే కేవలం కొంత భూమిని కోల్పోవడం కాదు. ఆ మైదానంలో ఆడాలని కలలు కనే వేలాది మంది చిన్నారుల అవకాశాలను కోల్పోవడం. ఒకసారి ఆటస్థలం వాణిజ్య సముదాయంగా లేదా పార్కింగ్ స్థలంగా మారిపోయిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురావడం దాదాపు అసాధ్యం. 140 కోట్లకు పైగా జనాభా, ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం భారత్. అయినప్పటికీ ఇప్పటివరకు ఫిఫా పురుషుల ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోవడం ఆలోచించాల్సిన అంశం.
జనాభా కాదు.. వ్యవస్థే విజయాన్ని నిర్ణయిస్తుంది
క్రొయేషియా జనాభా 40 లక్షల కంటే తక్కువ. అయినప్పటికీ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. నాలుగు లక్షల జనాభా కూడా లేని ఐస్‌లాండ్ ప్రపంచకప్‌లో ఆడింది. మూడున్నర మిలియన్ల జనాభా ఉన్న ఉరుగ్వే రెండు ప్రపంచ కప్‌లు గెలుచుకుంది. జపాన్, దక్షిణ కొరియా పాఠశాల స్థాయి నుంచే ఫుట్‌బాల్‌కు ప్రాధాన్యం ఇచ్చి ప్రపంచ ఫుట్‌బాల్‌లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇవి ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. క్రీడాకారులను జనాభా తయారు చేయదు. పటిష్ఠమైన శిక్షణా వ్యవస్థలు, మౌలిక వసతులు, నిరంతర ప్రణాళికలే ప్రపంచస్థాయి ఆటగాళ్లను తయారు చేస్తాయి. క్రికెట్‌కు దక్కుతున్న ఆదరణ, పెట్టుబడులు, మౌలిక వసతులు ప్రశంసనీయమే. అయితే అదే సమయంలో ఫుట్‌బాల్‌తో పాటు ఇతర క్రీడలు కూడా అభివృద్ధి చెందే వాతావరణం కల్పించాలి. దేశంలో కొత్త క్రికెట్ స్టేడియాలు నిర్మితమవుతుండగా అనేక ఫుట్‌బాల్ మైదానాలు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చాలాచోట్ల క్రికెట్‌కు సదుపాయాలు ఉన్నా, ఫుట్‌బాల్‌కు తగిన స్థలాలు కనిపించడం లేదు. పట్టణ ప్రణాళికలో ఆటస్థలాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం మరో ప్రధాన సమస్యగా మారుతోంది.
మౌలిక వసతులే అసలైన పెట్టుబడి
జపాన్, జర్మనీ, క్రొయేషియా, ఐస్‌లాండ్ వంటి దేశాలు ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎదిగింది ఒక్కరోజులో కాదు. దశాబ్దాలపాటు యువ ఆటగాళ్ల అభివృద్ధి, నాణ్యమైన కోచ్‌లు, పాఠశాల స్థాయి పోటీలు, అకాడమీలు, కమ్యూనిటీ ఫుట్‌బాల్‌పై పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా ప్రపంచస్థాయి ఆటగాళ్లు నిరంతరం తయారవుతున్నారు. దేశంలో నాణ్యమైన ఫుట్‌బాల్ మైదానాల కొరత, గ్రామీణ స్థాయిలో శిక్షణా వ్యవస్థ బలహీనంగా ఉండటం, పరిమిత సంఖ్యలో అకాడమీలు, పాఠశాల స్థాయి పోటీల తగ్గుదల, ప్రతిభావంతుల ఎంపికలో పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలు ఫుట్‌బాల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఫుట్‌బాల్ అనేది ఒక వ్యక్తి ఒంటరిగా సాధన చేసి విజయం సాధించే క్రీడ కాదు. మైదానం, సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, పోటీలు, లీగ్‌లు.. ఇవన్నీ కలిసి ఒక ఆటగాడిని తీర్చిదిద్దుతాయి. అందుకే ప్రతి ఆటస్థలాన్ని కాపాడటం అంటే భవిష్యత్ తరాలకు అవకాశాలను కాపాడటమే.
జాతీయ ఫుట్‌బాల్ మిషన్ అవసరం
భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అవసరం. ప్రజా ఆటస్థలాలను వాణిజ్య అవసరాలకు మార్చకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలి. ప్రతి జిల్లాలో కనీసం ఒక ఫిఫా ప్రమాణాల ఫుట్‌బాల్ మైదానం ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రంలో ఆధునిక అకాడమీలు, శిక్షణ పొందిన కోచ్‌లు అందుబాటులో ఉండాలి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో క్రమం తప్పకుండా ఫుట్‌బాల్ లీగ్‌లు నిర్వహించాలి. మహిళల ఫుట్‌బాల్‌తోపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలను విస్తరించాలి. ఒక దేశం ప్రపంచ క్రీడా శక్తిగా ఎదగాలంటే భారీ స్టేడియాలు మాత్రమే సరిపోవు. ప్రతి కాలనీలో, ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే మైదానాలు ఉండాలి. ఎందుకంటే ప్రతి గొప్ప ఆటగాడి ప్రయాణం ఒక చిన్న ఆటస్థలంలోనే ప్రారంభమవుతుంది. క్రికెట్ దేశానికి గర్వకారణమే. అయితే ఫుట్‌బాల్‌కు కూడా సమాన అవకాశాలు కల్పించినప్పుడే భారత్ నిజమైన క్రీడాశక్తిగా అవతరిస్తుంది. భవిష్యత్ తరాలకు పార్కింగ్ స్థలాలు కాదు... ఆటస్థలాలు కావాలి. వాణిజ్య సముదాయాలు కాదు... కలలను నిజం చేసే మైదానాలు కావాలి. అప్పుడు మాత్రమే ప్రపంచ ఫుట్‌బాల్ వేదికపై భారత్ కూడా గర్వంగా అడుగుపెట్టే రోజు వస్తుంది.
గీతార్థ పాఠక్
(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)











