నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్‌స్టోక్స్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని వెల్లడించాడు. ప్రస్తుతం స్టోక్స్ ఇంగ్లండ్ టెస్టు టీమ్‌కు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాలుగో రోజు ఆట మధ్యలో స్టోక్స్ రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించాడు. అయితే చివరి టెస్టు ప్రారంభానికి ముందే స్టోక్స్ రిటైర్మెంట్ గురించి ప్రకటన చేశాడు. మరో వారం రోజులు మాత్రమే తాను ఇంగ్లండ్ జట్టుతో ఉంటానని పేర్కొన్నాడు.

ఇక తాజాగా రిటైర్మెంట్ గురించి అధికారికంగా ప్రకటించాడు. దాదాపు 15 ఏళ్ల ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో కొనసాగిన స్టోక్స్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. 122 టెస్టులు, 114 వన్డేలు, మరో 43 టి20 మ్యాచుల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ కెరీర్‌లో 11వేలకు పైగా పరుగులను సాధించాడు. అంతేగాక మూడు ఫార్మాట్‌లలో కలిపి దాదాపు 350 వికెట్లను పడగొట్టాడు.