న్యూఢిల్లీ: ఒకప్పుడు నక్సల్స్ ఉగ్రవాదానికి కంచుకోటుగా ఉన్న కర్రెగుట్ట కొండపై ఇప్పుడు త్రివర్ణపతాకం గర్వంగా రెపలాడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. స్వాంతంత్య్ర వేడుకలు కొండపై ఘనంగా నిర్వహిస్తున్నట్టు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు. ఒకప్పుడు తుపాకులు గర్జించిన చోటే ఇప్పుడు దేశభక్తి ప్రతిధ్వనిస్తోందని, ఎర్ర నేలపై రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం నక్సలిజం రహిత నూతన బస్తర్ బలం, అభివృద్ధి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో మూడు రోజుల పాటు సాగిన బస్తర్ తిరంగా యాత్ర 600 కిలోమీటర్లు మేరకు ప్రయాణించి శుక్రవారంనాడు కర్రెగుట్ట కొండలకు చేరుకుంది. జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో ఈ ప్రాంతంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తిరంగాయాత్రలో ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ, అటవీశాఖ మంత్రి కేదార్ కశ్యప్ మోటర్ సైకిల్ ర్యాలీకి నాయకత్వం వహించగా, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు, సామాజిక వర్గాల నేతలు పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల చివరి గమ్యస్థానంగా కర్రెగుట్టను పరిగణిస్తారు.

జాతీయ జెండా ఎగురవేసిన మోహన్ భాగవత్

కాగా, నాగపూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయంలోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భారీ భద్రత మధ్య జరిగిన ఈ వేడుకలో ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ప్రచారక్‌లు పాల్గొన్నారు. రేషింబాగ్‌లోని డాకర్టర్ హెగ్డేవార్ స్మారక్ మందిరం వద్ద కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించింది. నాగపూర్‌లోని పలు చోట్ల రూట్ మార్చ్‌లలో సంఘ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

బీజేపీ ప్రధాన కార్యాలయంలో నితిన్ నబీన్

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పార్టీ జాతీయ అద్యక్షుడు నితిన్ నబీన్ త్రివర్ణ పతాకం ఎగురవేశారు. జెండా ఆవిష్కరణకు ముందు పార్టీ కార్యకర్తలు ‘వందేమాతరం’, అనంతరం జాతీయగీతం ఆలపించారు. దేశప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారత్ సంకల్పంతో ముందుకు వెళ్లేందుకు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నామని చెప్పారు.