మన తెలంగాణ/హైదరాబాద్: త్రాగు, సాగు నీటి వినియోగంపై ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షణకు అనుకూలంగా ఉండే విధంగా రెండు రాష్ట్రాల మధ్యన ఒడంబడిక కుదుర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ, -కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, త్రాగు, సాగునీటి అవసరాలపై కర్ణాటక రాష్ట్ర చిన్ననీటి తరహా శాఖ మంత్రి బోసురాజు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సోమవారం భేటీ అయ్యారు.

ఈ భేటీలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, క్రీడల శాఖామంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా శాఖ సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి రాయచూరు లోకసభ సభ్యులు జి.కుమార్ నాయక్, నాగర్ కర్నూల్ లోకసభ సభ్యుడు మల్లు రవి లతో పాటు రాయచూరు రూరల్ శాసనసభ్యుడు బసన్నగౌడ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘారెడ్డి, శివకుమార్ రెడ్డి, వంశీకృష్ణ, రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, ఈఎన్‌సి రమేశ్ బాబు, కర్ణాటక రాష్ట్ర చిన్నతరహా నీటిపారుదల శాఖా కార్యదర్శి బి.కే పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

స్నేహాపూర్వక వాతావరణంలో చర్చలు నిర్వహించాం

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల వినియోగంపై పరస్పర అవగాహనతో స్నేహాపూర్వక వాతావరణంలో చర్చలు నిర్వహించామన్నారు. భవిష్యత్‌లో అనుసరించ బోయే విధానాలు ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిళ్ల కుండా ఉండేలా అనుసరించాల్సిన ప్రతిపాదనలను కర్ణాటక చిన్న నీటి తరహా శాఖ మంత్రి బోసురాజుకు సమగ్రంగా వివరించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సాంకేతికత అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ సాగునీటి, త్రాగునీటి హక్కులు పరిరక్షణ భవిష్యత్ అవసరాలకు అనుసరించాల్సిన విధి, విధానలపై ప్రాథమిక చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు.

అంతర్ రాష్ట్ర సమన్వయంతో త్రాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారానికి రూపొందించిన ప్రతిపాదనలు కర్ణాటక ముందుంచినట్లు ఆయన చెప్పారు. కృష్ణా నది జలాశయాల వినియోగంపై జరిగిన ఉభయ రాష్ట్రాల చర్చల్లో తెలంగాణ రైతాంగం సాగునీటి అవసరాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి చర్చించినట్లు ఆయన తెలిపారు. సాగునీటి, త్రాగునీటి విషయంలో రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లకుండా ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండే విధంగా కృష్ణా జలాల వినియోగంపై కూలంకషంగా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి వివరించి సమష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.