హైదరాబాద్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుక్కల రక్తం అక్రమ విక్రయాల దందాపై నటి రేణుదేశాయ్ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణాలను చూస్తుంటే సమాజం ఎంతటి భయంకరమైన ’కలికాలం’లో ఉందో అర్థమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘మనుషులనే కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్మేసే కఠిన హృదయులు ఉన్న చోట, నోరులేని కుక్కలను వదులుతారని ఎలా అనుకుంటాం?‘ అని ఆమె ప్రశ్నించారు. రక్తం అమ్మేవాడి కంటే కొనేవాడిదే పెద్ద తప్పని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా సేకరిస్తున్నారు అనే కనీస అవగాహన లేకుండా కొనడం వల్ల ఇలాంటి అక్రమ దందాలకు ఊతం ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. తప్పు చేసిన వారు ప్రకృతి సిద్ధమైన శిక్ష నుంచి తప్పించు కోలేరని ఆమె పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరూ కర్మ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోవాలి. మనం చేసే ప్రతి తప్పుకు ఫలితం అనుభవించా ల్సిందే. మనం చేసే కర్మ మనకు కచ్చితంగా తిరిగి వస్తుంది‘ అని ఆమె హెచ్చరించారు.