ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు, యువ సంచలనం తాన్వి శర్మ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. అయితే భారత క్రీడాకారిణిలు మాల్విక బన్సోద్, తాన్య హేమంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. అగ్రశ్రేణి షట్లర్ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి బరుహాను ఓడించింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు 22-20, 21-12 తేడాతో ఇషారాణిపై విజయం సాధించింది. తొలిసెట్‌లో సింధుకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. హోరాహోరీగా సాగిన పోరులో చెమటోడ్చి నెగ్గింది. కానీ రెండో సెట్‌లో మాత్రం సింధుకు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. దూకుడుగా ఆడిన సింధు అలవోకగా సెట్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.

మరో పోరులో తాన్వి 21-13, 21-15తో భారత్‌కు చెందిన సహచర షట్లర్ మాల్విక బన్సోద్‌ను కంగుతినిపించింది. ఆరంభం నుంచే తాన్వి అద్భుత ఆటను కనబరిచింది. తనకంటే మెరుగైన క్రీడాకారిణి అయిన మాల్వికపైన స్పష్టమైన ఆధిపత్యాన్ని చెలాయించింది. అద్భుత షాట్లతో అలరించిన తాన్వి అలవోకగా రెండు సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మరో పోరులో తాన్య పరాజయం చవిచూసింది. రెండో సీడ్ పొర్న్‌పొవి చొచువాంగ్(థాయిలాండ్)తో జరిగిన మ్యాచ్‌లో తాన్య 12-21, 15-21తో ఓటమి పాలైంది. ఇదిలావుంటే పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన హరిహరణ్, ఎంఆర్ అర్జున్ జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత జంట 21-17, 21-7తో ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ ఓవెన్, డైలాన్ జోడీని ఓడించింది.