
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతంలోని క్యూర్ పరిధిలో తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా ని యోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామని, త్వరలో మ రో 8 నియోజకవర్గాల్లో కూడా ఈ పథకం అమ లు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పేద వాడి సొంతిం టి కల నెరవేరే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం కొనసాగుతుందని, చివరి లబ్దిదారునికి ఇల్లు అందేవరకు కొనసాగుతుందని , ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో స హచర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ తదితరులతో క లిసి క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఇందిరమ్మ ఇళ్ల బ్రోచర్, మీసేవ, వా ట్సాప్ దరఖాస్తులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సహేతుకంగా వివరించిన నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామానికి చెందని కొండా నాగరాజుకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేసి మంత్రులు సత్కరించారు. నేటి నుంచి ఆగష్టు 10వ తేదీ వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను స్వీకరిస్తామని మంత్రి తెలిపారు.
వచ్చే నెలలోగా రెండు లక్షలకుపైగా ఇళ్లు
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో తొలివిడతగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయగా రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని ఇప్పడు క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లు ప్రారంభిస్తూ 8 లక్షల ఇళ్లు పేదలకు అందిస్తున్నామన్నారు. వచ్చే నెలలోగా రెండు లక్షలకు పైగా ఇళ్లు పూర్తికాను న్నాయన్నారు. గత పాలకులు పనికిరాని ఆలోచన కారణంగా ఎన్నికల సమయంలో హైదరాబాద్‌కు 30 నుంచి -35 కిలోమీటర్ల దూరంగా ఇళ్లను నిర్మించడం వలన కేవలం 8-9 వేల మంది మాత్రమే నివాసాల్లో దిగారని, మిగిలిన వారు మంజూరు పత్రాలు తీసుకున్నారే తప్ప దిగలేదన్న విషయం తమ పరిశీలనలో వెల్లడైందన్నారు.
ఈ పరిస్థితుల్లో పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. పేదల నివాస ప్రాంతాల్లోనే 528 చదరపు అడుగుల వైశాల్యంతో సుమారు రూ.40- నుంచి రూ.60 లక్షల రూపాయిల విలువ కలిగిన స్థలాలను ఆడపడుచుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మంత్రి తెలిపారు. దీనిని పదేళ్ల వరకు అమ్ముకునే అవకాశం ఉండదని, అయితే బ్యాంకులో రుణం కోసం తనఖా పెట్టుకోవచ్చన్నారు. ఇళ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఉంటుందన్నారు. ఒకవేళ ఇల్లు మంజూరు కాకపోతే కట్టిన రూ.10 వేల రూపాయిలు తిరిగి చెల్లిస్తామన్నారు.
ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఉచితంగా
ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలను ఉచితంగా ఇస్తుందని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.11 లక్షల రూపాయిల వరకు ఖర్చు అవుతుందని లబ్ధిదారుల నుంచి మిగిలిన ఆరు లక్షల రూపాయలను నాలుగు వాయిదాల్లో తిరిగి తీసుకుంటామని, ఆ మొత్తంలో ఈ 10 వేల రూపాయిలను మినహాయిస్తామని మంత్రి తెలిపారు. ఏ నియోజకవర్గ ప్రజలు ఆ నియోజకవ ర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి స్థలాలను ఎంపిక చేస్తామన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి మీసేవ, వాట్సాప్ ( నెంబర్ 8096958096), వెబ్‌సైట్ ద్వారా ఆగష్టు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లబ్దిదారుని కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6లక్షల వరకు ఉండాలని, దరఖాస్తు దారుని పేరిట క్యూర్ పరిధిలో స్థలం, సొంత ఇల్లు ఉండకూడదన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తారని. అర్హత బట్టి కేటాయింపు జరుగుతుందన్నారు.
528 చదరపు అడుగుల ఫ్లాట్‌లో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్
360 డిగ్రీల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వడపోత జరుగుతుందని, అప్పటికీ ఎక్కువ దరఖాస్తులు వస్తే అందరి ముందు బహిరంగంగా లాటరీ తీసి ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం కింద ప్రతిపాదించిన 528 చదరపు అడుగుల ఫ్లాట్ లో ఒక బెడ్‌రూమ్, హాల్, కిచెన్ ఉంటాయన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం జరుగుతున్న బోనాల జాతర శుభ సందర్బంలో క్యూర్ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వచ్చే ఏడాది క్యూర్ పరిధిలో కొత్త ఇందిరమ్మ ఇళ్ల నుంచే వచ్చే ఏడాది బోనాలు ఎత్తించే విధంగా నిర్మాణాలు శరవేగంగగా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా పేదవాని సంక్షేమం విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని బట్టి ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నామన్నారు. ఈ ప్రభుత్వం పేదవాడిని గురించే కాకుండా మధ్యతరగతి ప్రజానీకం గురించి కూడా ఆలోచన చేస్తోందన్నారు. ఇళ్ల విషయంలో త్వరలో మధ్యతరగతి ప్రజానీకానికి శుభవార్త అందిస్తామన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక చారిత్రాత్మక కార్యక్రమం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఒక చారిత్రాత్మక కార్యక్రమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకుంటున్నామని ఉచిత బస్సు, ఉచిత కరెంట్, అర్హులకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు ఇలా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్ పరిధిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం శుభపరిణామమన్నారు.
ఇళ్ల నిర్మాణాలు చేపట్టే నియోజకవర్గాలు
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని జల్‌పల్లి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాయదుర్గం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని తట్టిఅన్నారం, బండ్లగూడ, మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కౌకూర్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్, నీలోఫర్ ఆసుపత్రి సమీప పోలీస్ క్వార్టర్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హకీంపేట్ దర్గ, జూబ్లీహిల్స్, ఎమ్మెల్యేకాలనీ కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కుల్సుంపురా సమీప పోలీస్‌క్వార్టర్స్, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోని నందిముసలిగూడ, అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సిటీపోలీస్ లైన్స్ కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కెపిహెచ్‌బి కాలనీ, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోచారం ఎల్‌ఐజీకాలనీ
, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవ ర్గంలోని గాజులరామారం, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పాటిగడ్డ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మారేడ్‌పల్లి- మహేంద్రహిల్స్, మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం ఆర్‌అం డ్ బీ క్వార్టర్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, శాసనసభ్యులు దానం నాగేందర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేష్ , ప్రకాష్ గౌడ్, శ్రీగణేష్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, జాఫర్ హుస్సేన్, ముబీన్, హౌసింగ్ శాఖ ఎండి వి.పి. గౌతమ్, కలెక్టర్ ప్రియాంక ఆల, కమిషనర్లు పాల్గొన్నారు.











