
అమెరికాతో యుద్ధ విరమణ ఒప్పందం అమలులో భాగంగా ఇజ్రాయెల్ లెబనాన్‌లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ స్పష్టం చేశారు. యుద్ధం ముగిసిందని ప్రకటించాలంటే లెబనాన్ అంశం కూడా పరిష్కారం కావాలని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసిన వ్యాఖ్యల్లో అరాఘ్చీ మాట్లాడుతూ, లెబనాన్ దక్షిణ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతున్న ఉనికి అమెరికా-ఇరాన్‌ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి విరుద్ధమవుతుందని అన్నారు. లెబనాన్‌లో యుద్ధం ముగియడం, మొత్తం యుద్ధం ముగింపులో విడదీయరాని భాగం. ఈ యుద్ధంలో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైదొలగకపోతే యుద్ధం పూర్తిగా ముగిసినట్లు చెప్పలేం అని ఆయన పేర్కొన్నారు.
లెబనాన్‌పై భవిష్యత్తులో ఇజ్రాయెల్ చేపట్టే ఎలాంటి దాడినైనా తాము అవగాహన ఒప్పందం ఉల్లంఘనగానే పరిగణిస్తామని హెచ్చరించారు. అయితే అమెరికా ఇప్పటివరకు ప్రకటించిన వివరాల్లో లెబనాన్ అంశం ఒప్పందంలో భాగమా కాదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇరాన్ చేస్తున్న వ్యాఖ్యలు, ఇజ్రాయెల్ నాయకత్వం చేస్తున్న ప్రకటనలకు మధ్య భేదాభిప్రాయాలు బయటపడుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం మాట్లాడుతూ, యుద్ధ విరమణ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయమని, ఇజ్రాయెల్‌కు తన సొంత భద్రతా ప్రాధాన్యాలు ఉన్నాయని చెప్పారు. అవసరమైనంత కాలం లెబనాన్‌లోని భద్రతా బఫర్ జోన్‌లో తమ సైన్యం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28న అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడులతో ప్రారంభమైన యుద్ధాన్ని ముగించేందుకు ఈ ఒప్పందం కుదిరినట్లు భావిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి ప్రత్యక్ష భాగస్వామి కాదు. ఇప్పటివరకు ఒప్పందం పూర్తి వివరాలు బహిర్గతం కాకపోవడంతో అనేక అంశాలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జెనీవాలో జరగనున్న
అధికారిక సంతకాల కార్యక్రమానికి ముందు కూడా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ పాలక వ్యవస్థలోని పలువురు అగ్రనేతలు కూడా మరణించినట్లు సమాచారం. అలాగే ఇంధనం, ఆహార పదార్థాలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. అమెరికా అధికారుల వివరాల ప్రకారం, ఈ ఒప్పందంలో భాగంగా హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవడం, సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఇరాన్ విదేశీ బ్యాంకుల్లో నిల్వ ఉన్న నిధుల విడుదల, కొన్ని ఆంక్షల సడలింపు, ఇరాన్ పునర్నిర్మాణం కోసం 300 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటు వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సౌకర్యాలన్నీ ఇరాన్ ఒప్పందంలోని షరతులను అమలు చేయడంపై ఆధారపడి ఉంటాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు.











