కార్మికులారా ఏకంకండి! పోరాడండి! పోరాడితే పోయేదేమీ లేదు! బానిస సంకెళ్లు తప్పా!! ఈ నినాదం 180 సంవత్సరాల క్రితం కార్మికులు వివిధ పరిశ్రమలలో వారు చేస్తున్న పని పరిస్థితులపైన, జీవన పని విధానంపైన, వారు రోజువారీగా చేస్తున్న పని గంటలు.. పొందుతున్న వేతనాలు.. అందుతున్న సౌకర్యాలపై లోతు గా పరిశీలించి కార్మికులను సంఘటితపరచాల్సిన అవసరం ఉందని.. అందుకు రూపొందించిన కమ్యూనిస్టు ప్రణాళికలో కారల్ మార్క్, ఫెడరిక్ ఎంగిల్స్ ఉద్బోధించారు. అటు తర్వాత 1886లో చికాగో నగరంలో కార్మిక వర్గం ఎనిమిదిగంటల పని దినంకోసం ఉద్యమించారు. ఈ ఉద్యమమే అన్ని పట్టణాలకు మహాప్రళయంగా విస్తరించింది.. 8 గంటల పని దినం కోసం జరిగిన పోరాటంలో కార్మికులు తుపాకీ గుళ్లకు బలైనారు. రక్తతర్పణం చేసినారు.. వారికి సంఘీభావంగా ప్రపంచంలోని వివిధ పారిశ్రామిక నగరాలలో ప్రదర్శనలు జరిగినవి. వారికి సంఘీభావంగా ఎనిమిదిగంటల పని దినం కోసం మే 1న కార్మిక పోరాటాల సంఘీభావ దినం జరుపుకోవాలని అంతర్జాతీయ కార్మిక సమాఖ్య పిలుపునిచ్చింది. నాటి నుండి మే డేను కార్మిక దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నారు. మే డే అంటేనే కార్మికుల చెమట, త్యాగం, పోరాటం, ఐక్యతకు ప్రతీక. 1886లో 8 గంటల పని దినం కోసం చికాగో వీధిల్లో ప్రాణాలు అర్పించిన కార్మికుల స్ఫూర్తిని గుర్తుచేసే రోజు. కార్మికులకు హక్కులు ఎవరూ దానం చేయలేదని, పోరాటాలు నేర్పిన చారిత్రకమైన రోజు మే డే.

భారతదేశంలో పాలకులు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అమల్లోనికి తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులపై తీవ్రమైన దాడికి గురిచేస్తున్నాయి. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను ఒకే గొడుగు కిందికి తెచ్చినట్టు చెప్పినా అసలు ఉద్దేశం యజమానులకు మరింత స్వేచ్ఛ ఇవ్వడం కార్మికులను మరింత రక్షణలులేని హీనస్థితికి నెట్టడం, పని గంటలు పెరగడం, కనీస వేతనాలు పెంపు లేకుండా చేయడం, యూనియన్ హక్కులు బలహీనపరచడం, సమ్మె హక్కుపై పరిమితులు విధించడం, కాంట్రాక్టు ఉద్యోగాలను విస్తరించడం లాంటి తదితర అంశాలు ఈ లేబర్ కోడ్స్‌లో దాగి ఉన్నాయి. ఇవి కార్మిక సంక్షేమానికి కాదు, కార్పొరేట్ లాభాలకు సేవ చేసే విధానాలుగా ప్రభుత్వం రూపొందించినది. ప్రత్యేకంగా అసంఘటిత రంగ కార్మికులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా కార్మికులు, యువత ఈ లేబర్ కోడ్స్ ప్రభావానికి ఎక్కువగా గురవుతారు. ఇప్పటికే ఉపాధి భద్రత లేకుండా, తక్కువ వేతనాలతో సామాజిక భద్రత లేకుండా జీవిస్తున్న కోట్లాది మంది కార్మికుల జీవితాలు మరింత కష్టాల్లో పడే ప్రమాదం ఉంది.

మే డే మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నది. కార్మిక వర్గం ఐక్యమైతే ఏ దాడినైనా ఎదుర్కోగలం. గతంలోనూ కార్మికులు సంఘటిత శక్తితోనే కనీస వేతనం, పని గంటలు, సెలవులు, పి.ఎఫ్, ఇఎస్‌ఐ వంటి సామాజిక హక్కులను సాధించుకున్నారు. నేడు అదే ఐక్యతతో లేబర్ కోడ్స్‌పై దేశవ్యాప్తంగా ప్రతిఘటన నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ నలుమూలలా 10.5 కోట్ల మందికి పైగా కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న‘అంతర్జాతీయ కార్మిక సంఘాల సంఘం’ (డబ్ల్యుఎఫ్‌టియు) 140 ఎళ్ల క్రితం చికాగో మార్గదర్శకుల డిమాండ్లు ఎంత అవసరమో, నేటికీ అంతే అత్యవసరం అని పేర్కొంది.’ సామాజిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య స్వేచ్ఛలు, కార్మిక సంఘాల హక్కులపై దాడులు జరుగుతున్నాయి. అదే సమయంలో సామ్రాజ్యవాద యుద్ధాలు, జోక్యాలు ఎజెండాలో ఉన్నాయి’. మహిళా కార్మికులు, యువత, వలస కార్మికులు తీవ్రమైన దోపిడీ, తక్కువ వేతనాలు, అధిక ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, విద్య, సంస్కృతికి పరిమితంగా అందుబాటులో ఉండటాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారని తెలిపింది. కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక నియంత్రణల సడలింపుకు వారే మొదటి బాధితులు, ఇది వారిని పెట్టుబడిదారుల దాడులకు ప్రత్యేకంగా గురిచేస్తుంది’.

కార్మిక సంఘాల నాయకులపైనా, ప్రజాస్వామ్య స్వేచ్ఛలపైనా ప్రభుత్వ కార్పొరేట్ సంస్థల అణచివేత ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమవుతుందని, జనార్ధులను దాదాపు ఎలాంటి హక్కులు లేని చోట శ్రమశక్తిగా వాడుకుంటున్నారు. సమ్మెలను నేరంగా పరిగణిస్తున్నారు. వలసదారులను, శరణార్థులను దాదాపు ఎలాంటి హక్కులు లేని చవక శ్రమశక్తిగా వాడుకుంటున్నారు. జాతి వివక్ష, దోపిడీలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఇంధనసంక్షోభం, ద్రవ్యోల్బణం, అధిక ధరలు కార్మికుల ఆదాయాలను క్షీణింపజేస్తుండగా, వేతనాలు స్తంభించిపోయాయి. బహుళ జాతి సంస్థల లాభాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనిని ఎదుర్కొన్నప్పుడు అంతర్జాతీయ కార్మిక వర్గం పోరాడటమే ప్రతిస్పందనగా ఉండాలని డబ్ల్యుఎఫ్‌టి యు పేర్కొంది.కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నందున.. కార్మిక వర్గ భవిష్యత్తును కాపాడుకోవడం నేటి తక్షణ కర్తవ్యం! రాబోయే తరాలకోసం కూడా! కార్మికుల హక్కులు బలహీనమైతే ప్రజాస్వామ్యం కూడా బలహీనమవుతుంది. ప్రతి కార్మికుడు మే డే రోజు ‘లేబర్ కోడ్స్‌ను తిప్పి కొడదాం, కార్మిక హక్కులను కాపాడుదాం’.. కార్మిక వర్గ విముక్తి కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం.. మేడే స్ఫూర్తి కార్మికులలో చైతన్యం నింపాలి. పోరాటమే మార్గమని, ఐక్యతే ఆయుధమని గుర్తు చేయాలి.


ఉజ్జిని రత్నాకర్ రావు,

94909 52646