ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఐదో విజయం నమోదు చేసింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మార్ష్ (55) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఆర్చర్ మూడు, బర్గర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో లక్నో బౌలర్లు సఫలమయ్యారు.

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 4 ఫోర్లతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (20) జట్టుకు అండగా నిలువలేక పోయాడు. హెట్‌మెయిర్ (22) కూడా ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోయాడు. అయితే రవీంద్ర జడేజా 29 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. ఫెరీరా (20), శుభమ్ దూబె 19 (నాటౌట్) అతనికి సహకారం అందించారు. లక్నో బౌలర్లలో షమి, మోసిన్ ఖాన్, ప్రిన్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు.