పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ మూవీతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను ‘కమిటీ కుర్రోళ్లు’ కొల్లగొట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. “కమిటీ కుర్రోళ్లు చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది.‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో అందరి కష్టం ఉంది.

యదు వంశీ ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది”అని అన్నారు. దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ .. “కమిటీ కుర్రోళ్లు’ నేషనల్ అవార్డ్ కొడుతుందని ముందు నుంచీ అందరికీ చెబుతూనే వచ్చాను. ఎవరెన్ని చెప్పినా కూడా నిహారిక సినిమాలో ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. పెట్టిన 9 కోట్ల గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. అలా ప్రారంభమైన ప్రయాణాన్ని ఆమె ఇప్పుడు జాతీయస్థాయిలో నిలబెట్టారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, మేకప్‌మెన్ రవి కుమార్, రాజు ఎదురోలు, అన్వర్ అలీ, ఫణి అడపాక, కొండల్ రావు, వెంకట్ సుబాష్, సందీప్ సరోజ్, ప్రసాద్ బెహరా, విషిక, తేజస్వి పాల్గొన్నారు.