మన తెలంగాణ/హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియ లో తమ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించేందుకు కాంగ్రెస్-మజ్లీస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రాష్ట్ర ఎన్నికల అధికారి (సిఇవో)కి ఫిర్యాదు చే శారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల పార్లమెంట్ ని యోజకవర్గాల్లో ఓటర్లపై జరుగుతున్న బెదిరింపులు, అక్రమ జోక్యం, ఓటరు నమోదు ప్రక్రియకు ఆటంకాలు, బిఎల్‌ఓలపై ఒత్తిళ్ల అంశాల ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి బిజెపి ప్రతినిధి బృం దం నివేదిక సమర్పించింది. అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ తాము చేసిన ఫిర్యాదుపై సిఇవో సానుకూలంగా స్పం దించారని, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. గత ఏడాది నుంచి బిఎల్‌ఓలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంట నే విడుదల చేసి వారికి న్యాయం చేయాలని, ఆదుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు.

వచ్చే నెల 3న ‘సర్‘ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో తమ పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రజలు, ఐటీ ఉద్యోగులు, వృత్తి రీత్యా స్థిరపడిన పౌరులు నివసిస్తున్నారని ఆయన వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు కాకుండా కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఎల్‌ఓలపై ఒత్తిడి తెస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు కాకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను స్వయంగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలను ప్రత్యక్షంగా చూసానని, అక్కడ అర్హులైన ఓటర్లను తప్పుదోవ పట్టించడం, నమోదు ప్రక్రియకు ఆటంకాలు కల్పించడం జరిగిందన్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న ఉత్తర భారత దేశానికి చెందిన వారు,

ఐటీ ఉద్యోగులు ఇక్కడే ఓటు నమోదు చేసుకోవాలని ముందుకు వస్తున్నప్పటికీ, వారిని ఓటరు జాబితాలో చేర్చకుండా ప్రయత్నించడం ఎన్నికల

కమిషన్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం రాంచందర్ రావు విమర్శించారు.ప్రభుత్వ ఉద్యోగులైన బిఎల్‌ఓలపై రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు రావడం ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. నగరంలో తమ పార్టీకి అనుకూలంగా ఉండే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు ఓటరు జాబితాలో నమోదు కాకుండా కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఓటర్లు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఓటు నమోదు విషయంలో ఎక్కడైనా ఒత్తిళ్లు, బెదిరింపులు, అక్రమాలు ఎదురైతే వెంటనే తమ పార్టీ దృష్టికి తీసుకుని రావాలని ఆయన కోరారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపించి, ఓటర్ల హక్కులను పరిరక్షించేలా తగిన చర్యలు తీసుకుంటామని సిఇఓ హామీ ఇచ్చారని రాంచందర్ రావు తెలిపారు.