
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన నేపథ్యం లో, ఇరాన్ కొత్త ఆయుధం గురించి హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆయుధం ప్రయోగిస్తే శ త్రు దేశాల బలగాలకు హార్ట్ ఎటాక్ వచ్చే పరిస్థితి ఏర్పడొచ్చు అంటూ ఇరాన్ సంచలన వ్యా ఖ్యలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాల తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య, ఇ రాన్ నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ ష హ్రామ్ ఇరానీ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ప్రతిగా అమెరి కా ఆంక్షలను ఎత్తివేయాలని, ఇరాన్ అణు కా ర్యక్రమంపై చర్చలు వాయిదా వేయాలని టెహ్రా న్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికను ట్రంప్ తి రస్కరించిన తరువాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
దీంతో హార్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా నౌకాదళ నిర్బంధాన్ని కొనసాగించాలని వాషింగ్టన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరింత కఠిన వైఖరిని అవలంబిస్తోంది. రాష్ట్ర నియంత్రిత ప్రెస్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ, అతిగా భయపెట్టే కొత్త ఆయుధాన్ని శత్రు బలగాలు త్వరలోనే ఎదుర్కొంటాయి అని హెచ్చరించారు. ఆ ఆయుధం ఇప్పటికే వారి పక్కన ఉంది. అది చూసి వారికి హార్ట్ ఎటాక్ రాకూడదని ఆశిస్తున్నాను అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అయితే ఆ ఆయుధం ఏమిటనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక హార్మూజ్ జలసంధి ద్వారా ఇరాన్ చమురు వ్యాపారాన్ని అడ్డుకుని ఆర్థిక ఒత్తిడి తీసుకొచ్చి టెహ్రాన్‌ను చర్చల బల్లపైకి తీసుకురావాలన్న ట్రంప్ ప్రభుత్వ వ్యూహాన్ని కూడా ఆయన ఎద్దేవా చేశారు. తమ తాజా దాడులు, ఒత్తిళ్ల ద్వారా తక్కువ సమయంలోనే ఆశించిన ఫలితాలు సాధిస్తామని శత్రువులు భావించారు. కానీ వారి అంచనాలు తప్పుతాయి అని షహ్రామ్ ఇరానీ వ్యాఖ్యానించారు. శత్రువులు వేసిన ఆ అంచనా ఇప్పుడు సైనిక అకాడమీల్లోనే జోక్‌గా మారిపోయింది అంటూ షహ్రామ్ ఇరానీ వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన అబ్రహాం లింకన్ విమాన వాహక నౌకపై ఇరాన్ బలగాలు కనీసం ఏడు సార్లు క్షిపణి దాడులు నిర్వహించాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల కారణంగా కొంతకాలం పాటు ఆ యుద్ధ నౌక నుంచి అమెరికా యుద్ధ విమానాలను ప్రయోగించడం, వైమానిక ఆపరేషన్లు నిర్వహించడం సాధ్యపడలేదని ఆయన స్పష్టం చేశారు.
యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్ వినియోగించిన వ్యూహాలు
అరేబియా సముద్రం వైపు నుంచి హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నట్లు కమాండర్ షహ్రామ్ ఇరానీ తెలిపారు. వాళ్లు మరింత దగ్గరికి వస్తే ఎలాంటి ఆలస్యం లేకుండా సైనిక చర్యలు చేపడతాం అని హెచ్చరించారు. అమెరికా నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ, మా పోర్టుల నుంచి కొన్ని నౌకలు బయలుదేరాయి. మరికొన్ని తమ గమ్యస్థానాలకు చేరుకున్నాయి అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నౌకలను అమెరికా బలగాలు అక్రమంగా స్వాధీనం చేసుకోవడాన్ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం సముద్ర దోపిడీ మాత్రమే కాకుండా బందీలుగా పట్టుకోవడం లాంటిదని ఆరోపించారు. నౌకలపై ఉన్న సిబ్బంది, వారి కుటుంబాలను అమెరికా బందీలుగా మార్చింది. సోమాలియా సముద్ర దొంగలు పేదరికం కారణంగా అలా చేశారు. కానీ అమెరికా మాత్రం దానికి బందీ వ్యవహారాన్ని కూడా జోడించింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో మరణించిన ప్రజలకు ప్రతీకారం తీర్చుకుంటామని, మా రక్తం చివరి బొట్టు వరకు పోరాడతాం. వాళ్లు జీవితాంతం పశ్చాత్తాపపడేలా దెబ్బ కొడతాం అని ఇరానీ హెచ్చరించారు.
ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్
హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ప్రతిగా అమెరికా నిర్బంధాన్ని ఎత్తివేయాలన్న ఇరాన్ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ప్రణాళిక ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని టెహ్రాన్ కోరింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి దారితీసిన ప్రధాన విభేదాలు ఇంకా పరిష్కారం కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరాన్ చర్చలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. బాంబుల కంటే నిర్బంధం మరింత ప్రభావవంతంగా పనిచేస్తోంది. ఇకపై అది ఇరాన్‌కు మరింత కఠినంగా మారుతుంది. వారికి అణ్వాయుధాలు ఉండకూడదు అని ట్రంప్ యాక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను తరువాతి దశకు వాయిదా వేయాలనే ప్రతిపాదనను ఈ వారం ఇరాన్ అమెరికా నాయకత్వానికి పంపినట్లు ప్రాంతీయ అధికారులు వెల్లడించారు. మూసివేసిన చర్చల నేపథ్యంలో తమ పేర్లు వెల్లడించకూడదనే షరతుతో వారు ఈ విషయాన్ని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తాము యుద్ధానికి దిగిన ప్రధాన కారణాల్లో ఒకటని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
‘అణు, క్షిపణి సామర్థ్యాలను కాపాడుకుంటాం’ ఇరాన్ సుప్రీం లీడర్ స్పష్టం
టెహ్రాన్: ఇరాన్ తన అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా భావిస్తోందని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకుంటామని ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశాలపై ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తరువాత బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, గురువారం ఒక లిఖితపూర్వక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది.దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న 9 కోట్ల గర్వించదగ్గ ఇరానీయులు మా దేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సాంకేతిక, పారిశ్రామిక సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా భావిస్తున్నారు. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు,
క్షిపణి సామర్థ్యాల వరకు అన్నింటినీ మా భూభాగం, జలాలు, గగనతలాన్ని ఎలా కాపాడుకుంటామో అలా రక్షిస్తాం అని ఖమేనీ పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు స్థానం సముద్రపు అడుగున మాత్రమే ఉంటుందని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం. దేవుడి కృపతో పర్షియన్ గల్ఫ్ ప్రాంత భవిష్యత్తు అమెరికా లేని భవిష్యత్తుగా మారుతుంది. అక్కడి ప్రజల అభివృద్ధి, సౌఖ్యం, సంక్షేమానికి సేవ చేసే ప్రాంతంగా అది రూపుదిద్దుకుంటుంది అని ఖమేనీ అన్నారు. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంత దేశాల ప్రజలందరికీ ఒకే విధమైన భవిష్యత్తు ఉంది. వేల కిలోమీటర్ల దూరం నుంచి ఆశలు, దురుద్దేశాలతో వచ్చే విదేశీయులకు అక్కడ స్థానం లేదు. ఉంటే అది సముద్రపు అడుగున మాత్రమే అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.










