
మాదాపూర్: హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. కూతురు విడాకులకు కారణమైన ఆమె ప్రియుడిని ఆమె కుటుంబ సభ్యులు పొడిచి చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా మదన్నపేట్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ (30), అదే గ్రామానికి చెందిన ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఇద్దరు కులాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తన కూతురు జోలికి వస్తే చంపుతానని యువతి తండ్రి పలుమార్లు భాస్కర్ ను బెదిరించాడు. దీంతో మూడు సంవత్సరాల క్రితం వేరే అతనికి ఇచ్చి యువతికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి జరిగినప్పటి నుంచి యువతి భర్తతో గొడవలు జరగడంతో విడాకులు తీసుకుంది. తన కూతురు విడాకులకు భాస్కర్ కారణమని అతడిపై యువతి కుటుంబ సభ్యులు కక్ష్య పెట్టుకున్నారు. నిన్న రాత్రి అయ్యప్ప సొసైటీ లోని భాస్కర్ ఉంటున్న ఉన్న హాస్టల్ కు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. హాస్టల్ నుంచి కిందకు వచ్చిన భాస్కర్ ను దుండగులు హత్య చేశారు.అమ్మాయి కుటుంబ సభ్యులు హత్య చేశారని అరోపిస్తు భాస్కర్ అన్న చిన్న పల్లి మధు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.










