న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకమై.. యువతకు మరింత బలమైన భవిష్యత్తును నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తిని మాత్రమే కబళించదని, మొత్తం కుటుంబం, సమాజం దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో మోదీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ‘అభివృద్ధి చెందిన భారత్ కోసం మాదకద్రవ్య రహిత యువత’ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందన్నారు. దీని లక్ష్యం స్పష్టంగా ఉందని, ‘మాదకద్రవ్యాలకు దూరంగా యువత.. మాదకద్రవ్య రహిత భారత్’ సాధించడమే ఉద్దేశమని చెప్పారు.

ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకుండా.. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఇందులో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. ‘భారత యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది మనందరి ఉమ్మడి సంకల్పం. దేశ యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచి, వ్యసనం నుంచి విముక్తి కల్పించే ఈ మంచి లక్ష్యంలో మనమంతా మన వంతు పాత్ర పోషిద్దాం’ అని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యసనం ఒక్క వ్యక్తినే ప్రభావితం చేయదని, దాని పర్యవసానాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని మోదీ అన్నారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తూ, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని అభినందించారు.

‘నషా ముక్త్ భారత్ అభియాన్’ (ఎన్‌ఎంబీఏ) ద్వారా మాదకద్రవ్యాల రహిత భారత్‌ను నిర్మించడం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ఒకటి. అవగాహన కల్పించడం, సమాజ భాగస్వామ్యం, చికిత్స, పునరావాసం, తదుపరి సంరక్షణ, తిరిగి సమాజంలో కలిసేలా చేయడం ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

మహిళలకు పీఎం స్వనిధి అండ

వీధి వ్యాపారుల కోసం అమలు చేస్తున్న పీఎం స్వనిధి యోజన గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని చెప్పారు. నగరాలు, పట్టణాల్లో వీధుల్లో కూరగాయలు, పండ్లు విక్రయించే మహిళలు, టీ దుకాణాలు నిర్వహించేవారు, పూలు, మట్టి ప్రమిదలు, పూజా సామగ్రి విక్రయించేవారు ఎంతోమంది ఉన్నారని మోదీ గుర్తుచేశారు. చాలాసార్లు పెట్టుబడి లేకపోవడం వల్లే వారి వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందడం లేదని, ఇప్పుడు అలాంటి లక్షలాది మంది మహిళలకు ‘పీఎం స్వనిధి యోజన’ కొత్త బలాన్ని ఇస్తోందని అన్నారు. పీఎం స్వనిధి లబ్ధిదారుల్లో సుమారు 46 శాతం మంది మహిళలే ఉన్నప్పటికీ.. ఈ అంశంపై జరగాల్సినంతగా చర్చ జరగడం లేదని మోదీ పేర్కొన్నారు. అంటే దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారని చెప్పారు.

ఘాజియాబాద్‌కు చెందిన ఒక మహిళ, బెంగళూరుకు చెందిన మరో మహిళ ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన విషయాన్ని ప్రస్తావించిన మోదీ.. ఒక మహిళ వ్యాపారం అభివృద్ధి చెందితే, దానితోపాటు ఆమె కుటుంబం మొత్తం భవిష్యత్తు కూడా మెరుగుపడుతుందని అన్నారు. పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని, కుటుంబ అవసరాలు తీరుతాయని, మహిళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఇది ‘మహిళా సాధికారతకు ప్రత్యక్ష ఉదాహరణ’ అని పేర్కొన్నారు.

దేశభక్తి భావనను పెంచుతున్న ఆగస్టు

ఆగస్టు నెల రాగానే దేశవ్యాప్తంగా దేశభక్తి భావనలు విభిన్న రూపాల్లో వెల్లివిరుస్తాయని మోదీ అన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరి హృదయంలో దేశంపై ప్రేమ మరింత బలపడుతుందని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం, విభజన విషాదాల సంస్మరణ దినం ఆగస్టును ప్రత్యేకంగా నిలుపుతున్నాయని, స్వాతంత్య్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపుతున్నాయని తెలిపారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ఈ భావనను మరింత బలోపేతం చేస్తోందన్నారు. ఈ ఏడాది ‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం కావడంతో ఆగస్టు మరింత ప్రత్యేకంగా మారిందని చెప్పారు. త్రివర్ణ పతాక వేడుకలు భారత్‌కే పరిమితం కాలేదని మోదీ తెలిపారు. ఈ ఏడాది ‘సూర్యపథ్ తిరంగా’ కార్యక్రమం ద్వారా జాతీయ పతాకం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రయాణం చేసిందన్నారు.

‘ఫిజీలోని సువాలో సూర్యోదయంతో తొలుత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లోని భారత దౌత్య కార్యాలయాలు, కేంద్రాల్లో పతాకాన్ని ఆవిష్కరించారు. చివరికి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోనూ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. సూర్యుడు ప్రపంచాన్ని చుట్టివస్తున్న సమయంలో ఆయన అడుగుజాడల్లో భారత త్రివర్ణ పతాకం ఎగురవేసిన దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఊహించుకోవచ్చు’ అని మోదీ అన్నారు.

చంద్రుడి కక్ష్యలోకి మహిళా విద్యార్థుల ఉపగ్రహం

‘మిషన్ శక్తిశాట్’ గురించి ప్రస్తావిస్తూ.. దేశ ఆడబిడ్డల కలలు భూమి నుంచి అంతరిక్షం వరకు విస్తరిస్తున్నాయని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కంటున్న వేలాది మంది బాలికలను భారత్ ఒక వేదికపైకి తీసుకువస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికా విద్యార్థులకు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకునే, ఆవిష్కరణల రంగంలో ముందుకు సాగేందుకు అవకాశం లభిస్తోందన్నారు. మహిళా విద్యార్థుల భాగస్వామ్యంతో పూర్తిగా అభివృద్ధి చేసే ఒక ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమం లక్ష్యం ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు.

రేడియో ప్రసంగంలో అవకాడోకు పెరుగుతున్న డిమాండ్‌ను కూడా మోదీ ప్రస్తావించారు. గతంలో ఈ పండును పెద్దగా ఎవరూ గుర్తించేవారు కాదని, దాని విలువ, డిమాండ్ కూడా తక్కువగా ఉండేదని చెప్పారు. అయితే ఇప్పుడు ఇది తరచూ భోజన పట్టికలపై కనిపిస్తోందన్నారు. ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అవకాడోకు ఆదరణ పెరిగిందని, ఇది రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా మారిందని చెప్పారు. గతంలో ఇతర పంటలు సాగు చేసిన పలువురు రైతులు ఇప్పుడు అవకాడో సాగు చేపడుతున్నారని, తద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారని తెలిపారు.

అలాగే ముంబయికి చెందిన కృష్ణ శేషాద్రి స్ఫూర్తిదాయక కథను కూడా మోదీ పంచుకున్నారు. భారత్‌లో గతంలో ఉనికిలో ఉన్న, ప్రస్తుతం పెద్దగా తెలియని రాజ్యాల గురించి సమాచారాన్ని అందించే భారత్‌రాజ్య.కామ్‌అనే వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం మోదీ ఉజ్బెకిస్థాన్‌లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఆయన నెలవారీ రేడియో ప్రసంగాన్ని సాధారణంగా కొన్ని రోజుల ముందే రికార్డు చేసి.. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారం చేస్తారు.