న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ లుంగి ఎంగిడికి తీవ్ర గాయమైంది. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. రెండో ఇన్నింగ్స్ లో పంజాబ్ కింగ్స్‌ బ్యాటర్ ప్రియాన్ష్ అర్య కొట్టిన బంతిని క్యాచ్‌ పట్టబోయి ఎంగిడి కిందపడిపోయాడు. బాడీవెయిట్‌ మొత్తం మెడ మీద పడటంతో తలకు తీవ్ర గాయమైంది.

వెంటనే ఫిజియో వెళ్లి పరిశీలించాడు. ఎంగిడి ఫిజియోకు స్పందిస్తున్నట్లు కనిపించినా.. అస్సలు కదల లేదు. దక్షిణాఫ్రికా ప్లేయర్స్ డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ తమ సహచరుడిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈక్రమంలో మైదానం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. వెంటనే అంబులెన్స్ ను మైదానంలోకి తీసుకొచ్చి ఎంగిడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.