
నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షూటింగ్‌లో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె రణబాలి, మైసా వంటి భారీ చిత్రాల షూటింగ్‌లలో వరుసగా పాల్గొంటోంది. ఈ సినిమాలకు సంబంధించిన కఠినమైన యాక్షన్ సీక్వెన్సులు, విపరీతమైన డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్‌లు ఆమె చేస్తోంది. అయితే తాజాగా ‘మైసా’ చిత్రానికి సంబంధించిన ఓ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో ఆమె తీవ్ర గాయానికి గురైంది. రష్మిక తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు అయిన ఈ గాయం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందట. సాధారణంగా క్రీడాకారుల్లో మాత్రమే ఇలాంటి టెండన్ గాయాలు కనిపిస్తాయని, ఈ పరిస్థితి నుంచి కోలుకోవడానికి రష్మిక కనీసం 6 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. రష్మికకు ప్రత్యేక రీహాబిలిటేషన్ చికిత్స కూడా అవసరమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ రణబాలి, మైసా చిత్రాలు చేయడంతో పాటు ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.
ఆమెకు ఈ తీవ్ర గాయం కావడంతో సినిమాల షూటింగ్‌లు, అడ్వర్టైజ్‌మెంట్ చిత్రీకరణలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక మందన్న త్వరగా కోలుకుని, మళ్లీ సినిమాల షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇక రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో రష్మిక గోండు తెగకు చెందిన మహిళగా కనిపించనుంది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా కీలక యాక్షన్ సీక్వెన్స్‌లు, అండర్ వాటర్ సీక్వెన్స్‌ను ఇటీవల పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా పాటను షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక ‘రణబాలి’లో నటిస్తోంది. సెప్టెంబర్ 11న ఈ చిత్రం విడుదల కానుంది.
గాయల పాలవుతున్న హీరోలు...
పలువురు టాలీవుడ్ హీరోలు ఇటీవల గాయాల పాలయ్యారు. ఇటీవల స్టార్ హీరో బాలకృష్ణ ‘ఎన్‌బికె111’ షూటింగ్‌లో గాయపడగా ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మరోవైపు తాజాగా ఎన్టీఆర్ భుజానికి కూడా గాయమైంది. ఆయన గాయం నుంచి కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ఇక ‘పెద్ది’ షూటింగ్‌లో రామ్‌చరణ్ మణికట్టుకు గాయమవగా, ఇటీవల కోయంబత్తూర్ వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నారు. గత కొంతకాలంగా భుజం గాయంతో బాధపడుతున్న స్టార్ హీరో పవన్‌కళ్యాణ్ ఇటీవల ముంబయ్‌లో ఆపరేషన్ చేయించుకున్నారు.








