పశ్చిమ బెంగాల్‌లో సంచలనం చోటుచేసుకుంది. ఓ మాజీ డ్రైవర్ ఇంట్లో కళ్లు చెందిరే రీతిలో నగదు, బంగారం బయటపడటం చర్చకు దారితీసింది. బీర్భుమ్ జిల్లాలో మీనార్ మొండల్ అనే రిటైర్డ్ బస్సు డ్రైవర్ నివాసంలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఇప్పటివరకు సుమారు రూ.28 కోట్ల నగదు, 15 కిలోల పసిడి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. నోట్ల కట్టలు భారీగా ఉండటంతో వాటిని లెక్కించే క్రమంలో 5 కౌంటింగ్ మెషీన్లు విఫలమైనట్టు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం, తులు మొండల్ అనే శిలల వ్యాపారికి మీనార్ మొండల్ బంధువు.

తులు మొండల్ తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత అనుబ్రత మొండల్‌కు సన్నిహితుడు. ఈ నేపథ్యంలో వీరు అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సోదాలు నిర్వహించగా రూ.5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారం లభించాయి. ఆ తర్వాత తనిఖీలు కొనసాగించడంతో నగదు మొత్తం సుమారు రూ.28 కోట్లకు చేరింది. ఈ ఘటనపై మీనార్ మొండల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని పోలీసులు వెల్లడించారు