
నర్సంపేట మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఆసుపత్రి అడ్వాన్డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి. విజయ్ కుమార్ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ముందుగా వరంగల్‌లో ఆసుపత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డికి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం) వల్ల బిసి పడిపోయి హార్ట్ ఎటాక్ (హెమోడైనమిక్ కొలాప్స్) వచ్చింది. అక్కడ వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సిపిఆర్ , ఎసిఎల్‌ఎస్ పద్ధతుల్లో అత్యవసర వైద్యం అందించి గుండె స్పందనను పునరుద్ధరించారు.
అనంతరం అక్కడ ప్రాథమిక చికిత్స (త్రాంబోలైసిస్) పూర్తి చేసి, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఆయనకు వైద్యం అందిస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై స్వల్ప మద్దతుతో శ్వాసక్రియ, బిపి అందుబాటులో ఉన్నప్పటికీ, 45 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం వల్ల నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. శబ్దాలకు, స్పర్శకు ఆయన ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వడం లేదని వైద్యులు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం బుధవారం న్యూరో అసెస్‌మెంట్ నిర్వహించి మెదడు పనితీరును మరోసారి అంచనా వేయనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
మంత్రి పొంగులేటి పరామర్శ...చికిత్సపై ఆరా
మాజీ ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మంత్రి శ్పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.











