పనపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని లోబర్చుకుని తనను మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యేపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కంతారావు తనను ప్రేమ పేరుతో నమ్మించి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి 2022లో హైదరాబాద్‌కు వచ్చి ఓ మీడియా సంస్థలో ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా ఉన్న రేగా కాంతారావును ఇంటర్వూ చేసేందుకు యువతి వెళ్లింది. యువతిది తన జిల్లా అని తెలుసుకున్న రేగా కాంతారావు అప్పుడే మాటలు కలిపి మచ్చిక చేసుకున్నాడు. యువతి వివాహం చేసుకుంటానని చెప్పాడు. భార్య పిల్లలు ఉండగా ఎలా చేసుకుంటావని యువతి ప్రశ్నించగా, తన భార్యతో విభేదాలు ఉన్నాయని, ఆమెకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో యువతి నమ్మింది.

అంతేకాకుండా యువతికి యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తానని చెప్పాడు, అప్పటి నుంచి ఇద్దరు శారీరకంగా తరచూ కలుసుకునేవారు. అమీర్ పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న యువతి కాంతారావు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఓ సినిమా నటుడికి చెందిన ఫ్లాట్ లో వీరు ఏకాంతంగా కలిసేవారు. కొద్ది రోజుల తర్వాత యువతి పెళ్లి విషయంలో ఒత్తిడి చేయడంతో కాంతారావు నిరాకరించాడు. వివాహం చేసుకోవడం కుదరదని దాటవేస్తూ వచ్చాడు, అతడి ప్రవర్తనను అనుమానించిన యువతి కాంతారావును దూరం పెట్టింది. దీంతో కాంతారావు యువతిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తాను పిలిచినప్పుడు రావాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. తాము ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా తీసిన వీడియోలు, ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి యువతి నుంచి రూ.౪ లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని చాలా రోజులు అవుతున్నా తిరిగి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి.

యువతి ఫోన్ లో ఉన్న ఆమె స్నేహితుల మొబైల్ నంబర్లను తీసుకున్న కాంతారావు ఓ మహిళతో ఎక్కువగా మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. ఈ విషయాలు తెలుసుకున్న యువతి హైదరాబాద్ షీటీమ్స్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే షీటీమ్స్ పోలీసులు రేగ కాంతారావును సంప్రదించగా ఫిర్యాదు చేసిన యువతి తనను డబ్బుల కోసం వేధింపులకు గురిచేస్తోందని తెలిపాడు. రేగ కాంతారావుపై పంజాగుట్ట పోలీసులు 69, 351(2)బిఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేశారు.