
నగరంలో సంచలనం సృష్టించిన అక్కాచెల్లెళ్ల మృతిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ విచారణకు ఆదేశించారు. మామిడి పండ్లు తినడంతోనే మృతిచెందినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అంతర్గత అవయవాల(విసేరా) నమూనాలను భద్రపరిచి ఫలితాల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించాలని సూచించారు. నివేదిక వచ్చాక మృతికి గల కారణాలు వెల్లడవుతాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం, బీదర్ ప్రాంతానికి వెజినాథ్, ఇందుమతి దంపతులు జీవనో పాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి హిమాయత్ నగర్, విఠల్ వాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు,ఇటీవల వారి బంధువు రేణుక వీరి ఇంటికి వస్తున్న
క్రమంలో నారాయణ గూడ, జలమండలి సమీపంలో మామాడి పండ్లను కొనుక్కొని వచ్చింది. వాటిని తల్లి ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు. ఆదివారం సాయంత్రం మామిడిపండ్లు తిన్న ఐదుగురికి వాంతులు, విరేచనాలు కావడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్న కుమార్తె సంధ్య (10), మూడో కుమార్తె భువనేశ్వరి(17) మృతి చెందారు. తల్లితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.











