వరంగల్ మామనూరు విమానాశ్రయం అభివృద్ధికి రూ.496.86 కోట్లను కేటాయించినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మోహోల్ లిఖీత పూర్వకంగా రాజ్యసభకు తెలియచేశారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలని ఎంపి వేం నరేందర్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వివరాలను రాజ్యసభకు వెల్లడించారు. వరంగల్ మామనూరు విమానాశ్రయం కోసం రన్‌వే, ఆఫ్రాన్, టాక్సీవే, సరిహద్దు గోడ నిర్మాణం వంటి పనుల కోసం ఇప్పటికే టెండర్‌లను పిలిచినట్టు రాజ్యసభకు ఇచ్చిన లేఖలో కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి తెలియచేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్,పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్టు కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేసే అంశంపై ఏఏఐ టెక్నో ఎకనామిక్ ఫీజిబులిటీ స్టడీ పూర్తి చేసినట్టు కేంద్రం తెలిపింది. పెద్దపల్లి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం ప్రతిపాదిత స్థలంపై ప్రాథమిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని 2026 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు కేంద్రం పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టు కోసం రాష్ట్రం సూచించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉందని కేంద్రం తెలిపింది. ఉడాన్ పథకం కింద తెలంగాణలో విమానాశ్రయాలను నిర్మించనున్నట్టు కేంద్రం తెలిపింది.