
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అర్థం అయ్యింది. ఎక్సిట్‌పోల్స్‌ను బొక్క బోర్లా పడేసి ఐదు రాష్ట్రాల ప్రజలు విలక్షణం అయిన తీర్పుకు పట్టంగట్టారు. మూడు పెద్ద రాష్ట్రలు రెండు చిన్న రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో చిన్న రాష్ట్రాలు అస్సాం, పుదుచ్చేరిలో ఎలాంటి మార్పు లేకుండా తిరిగి ఎన్డీయేనే అధికారం చేపట్టినప్పటికీ మిగతా మూడు పెద్ద రాష్ట్రలలో ప్రజలు ఊహించని తీర్పు నిచ్చారు. కేరళలో లెప్టుఫ్రంట్ ప్రభుత్వం అధికారం కోల్పోవడం అనేది తాము నమ్మిన కరుడుగట్టిన సిద్దాంతంకు కట్టుబడి మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కమ్యునిస్టు ప్రభుత్వం వ్యవహరించకపోవడం ఒక కారణం కాగా, ఆపార్టీ భౌతిక వాద దృక్పథం సైతం కొందరి ఆగ్రహానికి కారణం అయ్యింది. ఒకవైపు ఎన్నికలను వ్యతిరేకించే మావోయిస్టు పార్టీ సైద్ధాంతికంగా దెబ్బతిన్న పరిస్థితిలో ఎన్నికల ద్వారా అధికారంలో ఉన్న ఒకే ఒక్క కేరళ కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఓడిపోవడం అన్ని కమ్యూనిస్టు శ్రేణులను విస్మయ పరిచే అంశమే! అయితే ఈ రాష్ట్రం లో ఇండియాకూటమి ప్రదానభాగస్వామ్య పక్షం కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో అధికారం లోకి రావడం, బిజెపి పార్టీ కేరళలో గతంలో కంటే క్షీణించి పోవడం అనేది దేశంలోని ప్రతి పక్ష పార్టీలకు కొంతలో కొంతైనా ఊరట కలిగించే అంశం. ఇక తమిళనాడు విషయానికి వస్తే పార్టీ పెట్టిన రెండు నెలల్లోనే టీవికే పేరుతో పార్టీ పెట్టిసినిమా నటుడు విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయం సాధించడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్య పరిచింది.
సామాజికంగా వెనుక బడిన వర్గానికి చెందిన విజయ్ ఏకంగా పార్టీపెట్టి సియం కుర్చీ ఎక్కడం ఒక విలక్షణ చరిత్ర.ఆదిపత్యవాద రాజకీయాలకు ఇక చెక్‌నే! తమిళనాడులో సినీనటులను గెలిపించడం సర్వ సాధారణ విషయమే అయినా తిరిగి ఒంటరిగా బరిలో దిగిన ప్రాంతీయ పార్టీని అధికారంలోకి తేవడం విశేషం. ఇక్కడ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఒంటరిగా కాకుండా డియంకే, ఏఐడియంకేలలో ఏదో ఒక కూటమితో జతకట్టడం, గత అర్థ శతాబ్ద కాలంగా డియంకే, ఏఐడియంకే పార్టీలను ప్రతిసారీ మార్చి, మార్చి గెలిపించడం తమిళనాడు లోచూశాం. తమిళ రాజకీయ సాంప్రదాయానికి బిన్నంగా ఈసారి డియంకే, ఎఐడియంకే కూటమిలను తిరస్కరించి సింగిల్ గా బరిలోకి దిగిన సినీ తమిళ యువ సింగం విజయ్ కు పట్టంగట్టడం తమిళ ప్రజల విశిష్టత గా చెప్పుకోవచ్చును.ఇక్కడ సీనియర్ నటులు కమలహాసన్, రజనీకాంత్ , విజయ కాంత్ లాంటి వాళ్ళు ఊగిసలాట వలన తమిళ నాట ప్రజల్లో రాణించలేక పోయినప్పటికీ విజయ్ దూకుడు, దైర్యంకు ప్రజలు పట్టంగట్టారు.అదికార డియంకే పార్టీస్టాలిన్ వారసత్వంగా ఉదయనిధి స్టాలిన్ ను ప్రొజెక్టు చేయడం,సనాతనధర్మం పై రాజీలేని దాడి కూడా అధికారపక్షంకు కొంత వ్యతిరేకత గూడు కట్టుకొంది.
యువకుడు, అనేక ఆదర్శాలతో కూడుకున్న జెన్‌జెడ్ యువకుడు విజయ్‌ను తమిళ రాజకీయాల్లో ప్రదర్శించడం నిజంగా ప్రజల ఆకాంక్షనే. పూర్తి మెజారిటీ లేకపోయినా అంశాల వారీగా విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి రెండు కీలక ద్రావిడ పార్టీలు పోటీపడే అవకాశం ఉంది. మద్దతు ఇవ్వాల్సిన ద్రావిడ రాజకీయ అనివార్యతా ఉంది. తమిళ రాజకీయాల్లో విజయ్ విజయం తమిళ రాజకీయాల్లో కొత్తతరం ప్రజాప్రతినిధులకు ఇక వేదిక కానుంది. ఇక బెంగాల్ ఎన్నికల విషయం కొలిస్తే సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న మమతాబెనర్జీ ఒక రకంగా పోరాడి ఓడిపోయారు. ఆమె ఈసారి బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటమే కాకుండా, కేంద్రం అనుకూలంగా మారిన సంస్థలతో పాటు, ఎన్నికల వ్యవస్థ, న్యాయవ్యవస్థలో కూడా ఆమె అవిచ్ఛిన్నంగా పోరాడి ఓడారు. మమతా బెనర్జీ ఇక్కడ ఓటమి చెందినప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీని ఎన్ని రకాలుగా ఎండగట్టాలో అన్నిరకాలుగా ఎండగట్టడంలో ఆమె విజయం సాధించారు. కర్ణుడు చావుకు పలు శాపాలు అన్న విధంగా మమతా బెనర్జీ ఓటమిలో కూడా అన్ని రకాల రాజకీయ సమీకరణాలు పనిచేశాయి. మొదటిది కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గత ఓటమి నుండి ఇప్పటివరకు ఐదేళ్ళ కాలం మమతా బెనర్జీపైన అన్నిరకాల రాజకీయ వ్యూహాలను, ఎత్తుగడలను, ఒత్తిడిని అమలు పరిచారు.
మరోవైపు వారు గత పదమూడేళ్ళుగా అధికారంలో ఉండి ఎక్కడా అమలు జరపని వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిన ఆశలు కల్పించడం, ముస్లీం వ్యతిరేక క్యాంపెయిన్ బిజెపికి కలిసివచ్చిన అంశాలు కాగా, ఇండియా కూటమి విచక్షణారహిత అనైక్యత కూడా ఇక్కడ ప్రధాన కారణంగా ఉంది. మమతా బెనర్జీ మొండి తనంతో ఇండియా కూటమి పక్షాలను కలుపు కోకుండా బిజెపితో చేసిన ఒంటరి పోరాటం వికటించిందనే చెప్పవచ్చును. ముస్లీం ఓట్లు 30శాతం ఉన్నప్పటికీ ఎంఐయం లాంటి మతతత్వ పార్టీల పోటీ, సెక్యులర్ ఓట్లలో కాంగ్రెస్, సిపిఎం లాంటి వామపక్ష పార్టీల ఓట్లు చీలిక, సుదీర్ఘ కాలం మమత బెనర్జీనే అధికారంలో ఉండడం ఆమె ఓటమికి ప్రదాన కారణంగా చెప్పుకోవచ్చును. ఇక్కడ ఓట్లు చీలికనే బిజెపి గెలుపునకు బాటలు వేసిందనే అంచనా ఉంది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరు కుంటున్నారనే విషయం ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బహిర్గతం అవుతున్న జనం నాడి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రేపు దేశ రాజకీయ చిత్రపటం ఆవిష్కరణకు అద్దం పడుతున్నాయినే చెప్ప వచ్చును.
బిజెపి అధికారంను వాడుకొని పన్నుతున్న రాజకీయ వ్యూహాలను కాంగ్రెస్ దాని కూటమి పక్షాలు ఐక్యంగా ఎదుర్కోవడంలో దారుణం వైఫల్యం కనిపిస్తుంది. కాంగ్రెస్‌తో ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ కూడా సరైన సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం చెందుతుంది, ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్‌ను నమ్మలేని వైఖరి అనేది ఇండియా కూటమిలో అనైక్యతకు ప్రధాన కారణంగా ఉంది. కనుక బిజెపిపై వ్యతిరేకత వైఫల్యం కూడగట్టుకోవడంలో ఇండియా కూటమి దారుణంగా వైఫల్యం చెందుతుండగా, కాంగ్రెస్, ఇండియా కూటమిలో ఉన్న ఇతర పార్టీల మద్య వైరుధ్యాలు వినియోగం చేసుకోవడం, ఎన్నికల సందర్భాలు తగిన ఇన్‌స్టంట్ వ్యూహాలు రూపొందించడం, అందుకనుగుణంగా ఎత్తుగడల్లో బిజెపి సఫలం అవుతుంది. ఇదే బిజేపి విజయానికి ప్రతిపక్షాల అపజయానికి ప్రధానం కారణంగా ఉంది.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో అస్సాం, పుదుచ్చేరిలో అధికారం నిలబెట్టుకోవడం తోపాటు, మరో ఉత్తరాది రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో తిష్ట వేయడం ఆపార్టీకి ఎంతోకొంత నైతిక బలం కూడ గట్టుకుంది. ఉత్తరాది రాష్ట్రాలలో బిజెపి ఎదుగు దల స్థిరత్వంను సూచిస్తుండగా, దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టు దొరకని పరిస్థితే కనిపిస్తుంది. తమిళనాడు, కేరళ రెండు ప్రధాన దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల ఫలి తాలు అందుకు తాజా ఉదాహరణ. ఏది ఎలా ఉన్నా 2029 సాదా రణ ఎన్నికల నాటికి రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష, ప్రత్యార్థి పార్టీలను బలహీన పరచడమే లక్ష్యంగా బిజెపి ఎన్నికల వ్యూహం, లక్ష్యం ఉంది. సాదారణ ఎన్నికల నాటికి దేశ ప్రజలు మార్పు కోరు కుంటారా? మళ్ళీ బిజెపికి పట్టుగట్టి పరిపాలనా చరిత్రను తిరగరాస్తారా? అనే విషయం మిగిలిన మూడేండ్ల రాజకీయ పరిణామాలు, ప్రజలఆలోచన సరళి మాత్రమే నిర్థారించ నుంది. అప్పటి వరకు జాతీయ రాజకీయాల్లో పెద్ద మార్పులు ఉండే అవకాశం మాత్రం మృగ్యం.
- ఎన్.తిర్మల్














