మన తెలంగాణ/ సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న దశ భవిష్యవాణి ఘట్టం సోమవారం ఆధ్యాత్మిక శోభతో జరిగింది. ఆలయ ప్రాంగణంలో పచ్చి మట్టి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవహింపుతో భవిష్యవాణి వినిపించారు. అయితే, ఈసారి అధికారుల తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన మాట తప్పారని, ఆలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి రెండేళ్లు దాటినా ఎందుకు పూర్తిచేయలేదని నిలదీశారు.

ఏటా చెప్పే మాటలను పట్టించుకోనప్పుడు తనను ప్రశ్నలడగడంలో అర్థం లేదని మండిపడ్డారు. రాబోయే కాల పరిస్థితుల గురించి చెప్తూ, ఈ ఏడాది రాష్ట్రంలో కుంభవర్షాలు కురిసే అవకాశం ఉందని భవిష్యవాణి హెచ్చరించింది. ఊహించని వరదల వల్ల తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున పాలకులు, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటితో పాటు పరిశ్రమలు, నివాస ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అయితే, ధర్మమార్గంలో నడుచుకునేవారిని అమ్మవారు ఎల్లప్పుడూ వెన్నంటి కాపాడుతారని అభయం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు, వేల మంది భక్తులు పాల్గొన్నారు. భవిష్యవాణి పూర్తయిన తర్వాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం ఏనుగుపై అమ్మవారి అంబారీ ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.