తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఇకపై వారానికి ఒకసారి విద్యార్థులకు చికెన్ బిర్యానీ అందించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని గురువారంనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ వెల్లడించారు. ప్రతిపాదనను ముఖ్యమంత్రి విజయ్‌కు సిఫారసు చేశామని, దీన్ని ఆయన పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకం కాలక్రమేణా అనేక మార్పులు చూసిందని మంత్రి రాజ్‌మోహన్ గుర్తుచేశారు. జస్టిస్ పార్టీ కాలంలో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని కామరాజ్ విస్తరించారని, కరుణానిధి గుడ్లను ప్రవేశపెట్టారని తెలిపారు. ఇక ఎంజీఆర్, జయలలిత మరిన్ని పోషకాహార అంశాలను జోడించారని చెప్పారు. అదే తరహాలో విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలని తాను ప్రతిపాదించినట్లు వెల్లడించారు.