ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 9న రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధాని రాక సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బిజెపి రాష్ట్ర నాయకులు సన్నాహలు చేపట్టనున్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా మూడో దఫా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి రావడం ఇదే ప్రథమం. కాగా ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను ప్రధాని (పిఎంవో) కార్యాలయం అధికారికంగా ప్రకటించలేదు. అయితే బిజెపి రాష్ట్ర నాయకులు మాత్రం ప్రధాని రాక గురించి చెబుతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేయనున్నారని, ఎంఎంటిఎస్ మలి దశను ప్రారంభిస్తారని, ఇంకా బీబీ నగర్‌లోని ఏయిమ్స్‌ను ప్రారంభిస్తారని, రవాణా కనెక్టివిటీ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాజెక్టులను ప్రారంభిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఇదిలాఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల దృష్టా తాము భారీ బహిరంగ సభను నిర్వహించడం ద్వారా ప్రజలను, ముఖ్యంగా ఏ పార్టీకి సంబంధం లేని నూట్రల్స్‌ను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని పార్టీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేసి బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా మిగతా పార్టీలను విస్మయపరచాలని వారు అనుకుంటున్నారు. అయితే ప్రధాని పర్యటన అధికారికంగా వెలువడిన తర్వాత, బహిరంగ సభకు ప్రధాని అనుమతి తీసుకుని ఏర్పాట్లు ముమ్మరం చేయవచ్చని పార్టీ నాయకులు చెప్పారు.