ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. చిన్న, పెద్ద తేడాలేకుండా ఎవరి చేతుల్లో చూసిన ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఆఫీసు వర్క్, ఆన్‌లైన్ క్లాసెస్, సోషల్ మీడియా, వీడియోలు చూడటం, లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాటింగ్ చేయడం వంటి అన్నింటికీ ఫోన్‌లను ఉపయోగిస్తున్నాం. అయితే ఫోన్ నిరంతర వాడకం బ్యాటరీపై గణనీయమైన భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలో చాలా మంది తమ ఫోన్ త్వరగా డిశ్చార్జ్ అవుతోందని లేదా మునుపటిలా బ్యాటరీ లైఫ్ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతుంటారు. దీనికి అతిపెద్ద కారణం తరచుగా మన సరైన ఛార్జింగ్ అలవాట్లు లేకపోవడమే! కొన్ని సాధారణ టిప్స్ పాటించడం ద్వారా ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పాటు ఉండేలా చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా?


రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టకూడదు

మనలో చాలా మంది పడుకునే ముందు తమ ఫోన్‌ను ఛార్జింగ్‌ పెట్టి, ఉదయం వరకు అలానే పెడుతుంటారు. ఇప్పటి ఫోన్లలో ఓవర్‌ఛార్జింగ్ నుండి రక్షణ కల్పించే మోడ్రన్ టెక్నాలజీ ఉన్నప్పటికీ, ఎక్కువసేపు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి, ఛార్జింగ్ పూర్తయిన వెంటనే ఫోన్‌ను ఛార్జర్ నుండి తీసివేయడం ఉత్తమం.


బ్యాటరీ శాతం పూర్తిగా

ఫోన్‌ను 0 శాతానికి చేరే వరకు వాడటం బ్యాటరీ ఆరోగ్యానికి మంచిది కాదు. అది 20 నుండి 30 శాతానికి చేరగానే ఛార్జ్ చేయడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా, ప్రతిసారీ దాన్ని 100 శాతం వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సాధారణ వాడకంలో బ్యాటరీని 20 నుండి 80 శాతం మధ్య ఉండేలా చూసుకోవాలి.


సరైన ఛార్జర్‌ వినియోగం

ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి కంపెనీ అందించిన ఛార్జర్‌ను లేదా అదే నాణ్యత గల సర్టిఫైడ్ ఛార్జర్‌ను ఉపయోగించాలి. చౌక లేదా నకిలీ ఛార్జర్‌లు స్మార్ట్ ఫోన్ కు సరైన వోల్టేజ్, కరెంట్‌ను అందించకపోవచ్చు. దీనివల్ల బ్యాటరీ, ఛార్జింగ్ పోర్ట్ రెండింటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.


ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వేడెక్కకుండా

ఫోన్ మందపాటి కేస్‌లో ఉండి, ఛార్జింగ్ సమయంలో వేడెక్కితే, కేస్‌ను తీసివేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, ఛార్జింగ్ చేస్తున్నప్పుడు భారీ గేమ్‌లు ఆడటం, వీడియోలను ఎడిట్ చేయడం లేదా ఇతర భారీ యాప్‌లను రన్ చేయడం వంటివి చేయకూడదు.