భారత షట్లర్ పివి సింధు ఇటీవల జరిగిన జపాన్ ఓపెన్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు రాజమౌళి పోస్ట్‌కు సింధు ఇచ్చిన రిప్లై అందరినీ ఆకర్షిస్తూనే నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది.

సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించావు. మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చావు. కంగ్రాట్స్ సింధు. నిన్ను చూసి దేశం గర్విస్తోంది’’ అని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన సింధు.. ‘‘ధన్యవాదాలు రాజమౌళి సర్. మీ వారణాసి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒకవేళ మీరు తెరకెక్కించే ఏ సినిమాలో అయినా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే.. మీ పరిచయ నటిగా మారడానికి నేను ఎంతో సంతోషిస్తాను’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను పంచుకున్నారు.