మన తెలంగాణ/హైదరాబాద్: హైడ్రాను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే హైడ్రాను బంగాళాఖాతంలో కలిపేస్తామని ప్రకటించారు. బిఆర్‌ఎస్ పా ర్టీ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు దామోదర్‌రావు, పార్టీ సీనియ ర్ నేత జాన్సన్ నాయక్ తదితరులతో కెటిఆర్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హై డ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కెటిఆర్ స్పందించారు. హైడ్రాపై హైకోర్టు తీర్పు సిఎం రేవంత్‌రెడ్డి కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. హైడ్రా తొమ్మిది తలల విషసర్పంలా మారిందని హైకోర్టు వ్యాఖ్యానించిందని అన్నారు.

తెలంగాణ హైకోర్టు హైడ్రాపై వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా ప్రభుత్వం వైఖరిలో మార్పు లేదని విమర్శించారు. హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్, బెదిరింపుల రాజకీయాలు జరుగుతున్నాయని, దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి ఉందని ఆరోపించారు. చట్టం అందరికీ సమానమైతే ముందుగా అధికార పార్టీ మంత్రులు, నాయకుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్,పట్నం మహేంద్ర రెడ్డి నివాసాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. హైడ్రా పేరిట రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచకం చేస్తున్నారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి సోదరుల కబ్జాలో ఉన్న శిఖం భూములు ఏమయ్యాయని నిలదీశారు.హైడ్రా పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోంది తప్ప అధికార పార్టీ నేతలు, మంత్రులు, వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతిస్తున్నారు

రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బిఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండేదని కెటిఆర్ పేర్కొన్నారు. అది కాంగ్రెస్ హయాంలో కోటి ఎకరాలకు చేరిందని వెల్లడించారు. భూ వ్యవహారాల్లో అవినీతి, కమీషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో వేలాది ఇళ్లను కూల్చివేసి, ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. ఓరకంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతిస్తున్నారని అన్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు

డీలిమిటేషన్‌పై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కెటిఆర్ కోరారు. జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని విజ్ఞప్తి చేశారు. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం చేయొద్దని అన్నారు. లోక్‌సభ సీట్ల పునర్విభజనపై కేంద్ర విధానం ఏంటో ప్రకటించాలని కోరారు. పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లకు సంబంధించి కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ప్రభుత్వం ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో ఐదుసార్లు పేపర్ లీక్‌లు జరిగాయని, అందులో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో మూడుసార్లు జరిగాయని ఆరోపించారు. దేశానికి ఇప్పుడు జవాబుదారీతనం, పారదర్శకత, దీర్ఘకాలిక సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బిఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కోరాం

కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరామని కెటిఆర్ తెలిపారు. కొత్తగూడెం రైల్వే డివిజన్ సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అన్నారు. 2,000 కి.మీ. ట్రాక్‌తో కాజీపేటకు డివిజన్ అర్హత ఉందని చెప్పారు. హైదరాబాద్ - కరీంనగర్ రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలని రైల్వే శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. తమకు రాజకీయాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. అందుకే రాష్ట్ర ప్రజల తరఫున రైల్వే, ఐటీ రంగాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైల్వే ఉద్యోగులు కూడా కాజీపేట డివిజన్ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

కేవలం 900 కిలోమీటర్లతో గుంటూరు డివిజన్, సుమారు 2,200 కిలోమీటర్లతో విజయవాడ, గుంతకల్ డివిజన్లు కొనసాగుతున్న నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయడం పరిపాలనా పరంగా, అభివృద్ధి పరంగా ఎంతో ప్రయోజనకరమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. మనోహరాబాద్- సిద్దిపేట -సిరిసిల్ల-వేములవాడ -కొత్తపల్లి రైల్వే లైన్‌ను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని కోరామని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గానికి అత్యంత కీలకమైన 151 కిలోమీటర్ల మనోహరాబాద్ -సిద్దిపేట- సిరిసిల్ల- వేములవాడ -కొత్తపల్లి న్యూ బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజెక్టును అత్యవసరంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు.