
ప్రయాణికుల రద్దీకి అదనపు కోచ్‌లు అవసరం
కానీ.. ఆ కారణంతో జాప్యం తప్పేలాలేదు..!
మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలో రోడ్డు రవాణా పరిస్థితి నరకప్రాయంగా మారింది. ఎల్‌బీ నగర్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు, రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ వరకు ప్రధాన మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. పది కిలోమీటర్ల ప్రయాణం సాగాలన్నా గంటల సమయం పడుతుండటంతో హైదరాబాదీలు విసుగెత్తిపోతున్నారు. ఆటోలు, ట్యాక్సీలలో వెళ్లినా ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. గమ్యస్థానాలకు త్వరగా, ప్రశాంతంగా చేరేందుకు ప్రజలు ఏకైక ప్రత్యామ్నాయంగా మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అదనపు బోగీలతో రద్దీని నియంత్రించేందుకు అధికారవర్గాలు అడుగులు వేస్తున్నా.. కాలతీతం తప్పడం లేదు.
పెరుగుతున్న రద్దీ.. తప్పనిసరి అయిన బోగీల పెంపు
నగరంలో 2007 నవంబర్ 28 నుంచి మెట్రో రైలు పరుగులు పెట్టింది. అప్పుడు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ మూడు బోగీలతో రైళ్లను ప్రారంభించింది. అప్పట్లో నగరంలో ప్రయాణికుల రద్దీ అంచనాలకు తగినట్టుగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రారంభంలో రోజువారీ మెట్రో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ..క్రమేణా పెరుగుతూ ప్రస్తుతం సరాసరిన రోజుకు 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీకి చెక్ పెట్టేందుకు, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు మెట్రో రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటే ప్రస్తుతం కనిపిస్తున్న ఏకైక మార్గం. దీంతో ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దీనిపై దృష్టి సారించి, రద్దీని తగ్గించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రెండో దశ విస్తరణను కూడా అత్యంత వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే రెండో దశ పట్టాలెక్కి.. ఆ పట్టాలపై మెట్రో పరుగులు పెట్టాలంటే రెండేళ్లయినా పడుతుంది. ప్రస్తుత రద్దీని తట్టుకునేందుకు తక్షణమే బోగీలు పెంచాలని భావిస్తున్నప్పటికీ, ఆచరణలో మాత్రం తీవ్రమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి.
అసలు సమస్య ఏమిటంటే..!
గతంలో హైదరాబాద్ మెట్రో కోసం బోగీలను తయారు చేసిన దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ రోటెమ్ అనే హ్యుందాయ్ మోటార్ గ్రూప్‌నకు చెందిన ప్రముఖ సంస్థ. ఇది రైలు బోగీలు, హైస్పీడ్ రైళ్ల తయారీలో అంతర్జాతీయంగా పేరుగాంచింది. అయితే విదేశీ రైలు తయారీ కంపెనీలు భారీ ప్రాజెక్ట్‌లకు మాత్రమే పెద్ద ఎత్తున కోచ్‌లను ఉత్పత్తి చేస్తుంటాయి. కేవలం కొన్ని అదనపు బోగీల కోసం ఆ కంపెనీ ప్రత్యేకంగా తన ప్రొడక్షన్ లైన్‌ను మళ్లీ ఓపెన్ చేయడం వారికి ఆర్థికంగా గిట్టుబాటు కాదు.నాటి ఎల్‌అండ్‌టీ ప్రాజెక్ట్ ఒప్పందంతో ఆ కొరియా సంస్థతో ఉన్న కనెక్షన్ ముగిసింది. ప్రస్తుతం ఆ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల భారీ మెట్రో, హై-స్పీడ్ రైల్ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండటంతో చిన్నపాటి విడి ఆర్డర్లపై దృష్టి పెట్టే పరిస్థితి లేదు. ఒక విదేశీ కంపెనీకి మళ్లీ ఆర్డర్ ఇవ్వాలన్నా, లేదా కొత్త టెండర్లు పిలవాలన్నా కాలయాపన ఎక్కువవుతుంది. పైగా, ఇప్పటికే ఉన్న కొరియా డిజైన్లకు అచ్చంగా సరిపోయేలా బోగీలను వేరే దేశం నుంచి తెప్పించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ప్రస్తుతం మన దేశంలో రవాణా రంగానికి సంబంధించి దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలనే కఠిన నిబంధనలు ఉన్నాయి.
విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా మన దేశంలోని సంస్థల ద్వారానే కోచ్‌లు తయారు చేయించుకోవాలనే ప్రభుత్వ విధానం కూడా కొరియా కంపెనీ వైపు వెళ్లకుండా అడ్డుపడుతోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై మెట్రో అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగానే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ఆశ్రయించారు. ఢిల్లీ మెట్రోకు గతంలో కోచ్‌లు అందించిన బెంగళూర్‌లోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్)ను ఢిల్లీ మెట్రో సిఫారుసు చేసింది. పట్టాలపై ఉన్న మెట్రో బోగీల కొలతలు, సాంకేతిక ప్రమాణాలను పూర్తిగా పరిశీలించి, కొత్తగా అదనపు బోగీలను డిజైన్ చేసి తయారు చేయాలి. ప్రస్తుతం బెంగళూర్ కంపెనీతో సంప్రదింపుల దశలో చర్చలు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మెట్రో డిజైన్లకు సరిపోయేలా అదనపు బోగీలను డిజైన్ చేయంచడం సాంకేతికంగా కొంత సవాల్‌తో కూడుకున్నది. కనుక అనుభవమున్న ఢిల్లీ మెట్రో మార్గదర్శకత్వంలో ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎంత వేగంగా చేసినా పది నెలలు నుంచి యేడాది సమయం పట్టడం ఖాయంగా తెలుస్తుంది. అప్పటి వరకు నగరవాసులకు ట్రాఫిక్ రద్దీని భరించకతప్పదు.











