
మన తెలంగాణ/హైదరాబాద్: ఇప్పటి వరకు ఎల్ అండ్ టి ఆధీనంలో ఉన్న మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎల్ అండ్ టి కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ బుధవారం స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఇరువురు మెట్రో బదిలీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఎల్ అండ్ టి ఇన్ని సంవత్సరాలుగా నిర్వహించిన ఆపరేషన్స్, భవిష్యత్‌లో రెండోదశ మెట్రో పనుల్లో ఆ కంపెనీ భాగ స్వామ్యంపై వారిద్దరూ ప్రాథమికంగా చర్చించారు.
వంద శాతం షేర్లు రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువ స్వాధీనం
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-Iను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు ఎల్ అండ్ టితో కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే హెచ్‌ఎంఆర్‌ఎల్ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టి, ఎల్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్ ప్రతినిధులు బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎల్ అండ్ టి, ఎల్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్ లిమిటెడ్ సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్‌కు ఉన్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై హెచ్‌ఎంఆర్‌ఎల్ తరఫున ఎండి సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టి లిమిటెడ్ తరఫున డి.కె.సేన్, ఎల్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్ తరఫున కెవిబి రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టి హామీతో ఎల్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్ పై ఉన్న రూ. 13,538.53 కోట్ల అప్పును (2026, ఏప్రిల్ 30వ తేదీ నాటికి) రాష్ట్ర ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైయిజర్‌గా ఐడిబిఐ క్యాపిటల్ వ్యవహారించగా, లీగల్ అడ్వైయిజరీ సేవలను శరాఫ్ అండ్ పార్టనర్స్ అందించింది.
సుమారు 86 కోట్ల ప్రయాణాలు
హైదరాబాద్‌లో ఎల్ అండ్ టి మెట్రోరైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సంస్థ 2017, నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-Iను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-Iను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ఫేజ్-I, ప్రతిపాదిత ఫేజ్-II నెట్‌వర్క్ రూపకల్పన, పనులు, ప్రణాళిక, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతోంది. భవిష్యత్‌లోనూ హైదరాబాద్‌కు మరింత సమగ్ర, ఆధారపడదగిన, ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.










