
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాల మేరకు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం వెయ్యి కోట్ల నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు నిధుల విడుదల చేశారు. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుణుగుణంగా ఈ ఏడాది మార్చి వరకు ప్రతినెల ఉద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం అమలు చేసింది. అయితే, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను, వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా గమనించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని వెయ్యి కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలకు సంబంధించిన వెయ్యి కోట్ల రూపాయలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది.
గతేడాది అక్టోబర్ వరకు ఉన్న జిపిఎఫ్ క్లియర్
అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జిపిఎఫ్ బకాయిలన్నింటినీ ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేశారు. తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది సీనియర్ సిటిజన్లకు ఇది గొప్ప ఊరటనిచ్చే అంశం. ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా, ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు చెల్లించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం మెడికల్ బిల్లుల చెల్లింపులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క రోజు కూడా జాప్యం లేకుండా మెడికల్ బిల్లుల చెల్లింపులు రెగ్యులర్‌గా జరిగేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు. వారి సమస్యలను పరిష్కరించడం మా బాధ్యత అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పెంచిన నిధులు, క్లియర్ అయిన జిపిఎఫ్ బకాయిలు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఉద్యోగ వర్గాల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనే విషయాన్ని తాజా నిర్ణయం నిరూపిస్తోంది. ‘ఉద్యోగుల కష్టాలను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి చొరవతో పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.












