మెట్రోరైలు ప్రయాణీకులకు రోజు వారీ, నెలవారీ పాస్ లను ప్రవేశపెట్టడానికి తగు మార్గాలను అన్వేషించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. హెచ్‌ఎంఆర్‌ఎల్ బోర్డు అఫ్ డైరెక్టర్ల చైర్మన్ గా సంజయ్ జాజు తొలి సారిగా మెట్రో రైల్ నిర్వహణ, అభివృద్ధిపై శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా వ్యవస్థలు అన్నిటిలోను ఒకే టికెట్‌పై ప్రయాణించే విధానాన్ని అమలు చేసేలా తగు ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. ఉమ్మడి యాప్‌ని అభివృద్ధి చేసేలా టీజీఎస్‌ఆర్టీసీతో చర్చించాలని సీఎస్ తెలిపారు. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండో దశ అనుమతుల తాజా ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశంలో చర్చించారు.

అదనపు బోగీలను వీలైనంత త్వరగా సమీకరించడానికి తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బోర్డు అఫ్ డైరెక్టర్లు మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి, రోడ్లు, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీజీపీ (శాంతి భద్రతలు) మహేష్ భగవత్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ వర్క్ సీవరేజ్ బోర్డు ఎండీ కే.అశోక్ రెడ్డి, హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.***