
వస్తూ వస్తూనే తమిళనాడులో హిట్ కొట్టిన విజయ్ వెనువెంటనే తమ టివికె పార్టీ ఎన్నికల వాగ్దానాలపై దృష్టి సారించారు. ముందుగా తమిళ ఆడపడుచులకు ప్రకటించిన కానుకల విషయంపై పట్టుదలతో ఉన్నారని వెల్లడైంది. పెళ్లి సమయంలో వధువుకు 8 గ్రాముల బంగారం, కుటుంబంలో మహిళ పేరిట ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాసు సిలిండర్లు, 60 ఏండ్ల లోపు మహిళలకు మాసానికి రూ 2500 వరకూ ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన విజయ్ ఇప్పుడు దీనిని నిలబెట్టుకునే దిశలో ఇప్పటి నుంచే కార్యాచరణకు దిగారు. 22 క్యారట్ల బంగారం ధర ఇప్పుడు గ్రాముకు రూ 14000 వరకూ పలుకుతుంది. పెళ్లి అప్పుడు మహిళలకు అందించే బంగారం అపార విశ్వాసం పాదుకునేలా చేస్తుంది. వధువుకు నాణ్యమైన పట్టు చీర, తమిళ సాంప్రదాయాల మధ్య అందించడం జరుగుతుందని కూడా విజయ్ పార్టీ హామీ ఇచ్చింది. బంగారం, పట్టుచీర సెంటిమెంట్ ఎన్నికలలో బాగా పండిందనే విషయాన్ని విజయ్ తెరవెనుక వారు తేల్చిచెపుతున్నారు.
సోమవారం మధ్యాహ్నానికి వెలువడ్డ ఫలితాలతో విజయ్ పార్టీ సాధారణ మెజార్టీ బలం 118 కన్నా అతి కొద్దిగా తక్కువ స్థానాలు వచ్చాయి. అయితే తరువాతి ముఖ్యమంత్రి విజయ్ అనేది స్పష్టం అయింది. ఎన్నికల పత్రంలో విజయ్ పార్టీ అందరికి నాణ్యమైన విద్యపై పలు విషయాలను తెలిపింది. స్కూల్ డ్రాపౌట్ లేకుండా చేసేందుకు కుటుంబంలో తల్లులు లేదా సంరక్షకులకు వార్షికంగా రూ 15000 ఇస్తామని కూడా టివికె ప్రకటించింది. ఇక తమిళనాటనే కాకుండా దేశవ్యాప్తంగా పేరొందని కె కామరాజ్ పేరిట 100 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ తెరవడం, ఉన్నత విద్యకు కుటుంబ పరిస్థితులను బట్టి రూ 20 లక్షల మేర సాయం వంటివి కూడా విజయ్ వాగ్దానాలలో మిన్నగా నిలిచాయి. ఓట్లు పడేలా చేసిన వీటి గురించి ఆయన ఇప్పుడు అమలుకు చర్యలు చేపడుతున్నారు. ఇక రాష్ట్రంలో ఎఐ మంత్రిత్వశాఖ, ఎఐ సిటీ, ఎఐ యూనివర్సిటీ హామీలు కూడా వినూత్న రీతిలో నిలిచాయి. రైతాంగ ఆదాయ వృద్థిపై కూడా దృష్టి సారించారు. వ్యవసాయ రంగ సంక్షేమం గురించి ప్రస్తావించారు. ఐదు ఎకరాల్లోపు రైతులకు వ్యవసాయ సహకార సంఘాల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.
ఈ పరిమితి దాటిన వారికి రుణంలో సగం మాఫీ ఉంటుంది. వరికి కనీస మద్తతు ధరను క్వింటాలుకు రూ 3500 , చెరకుకు రూ 4500 గా తెలిపారు. నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని వారికి మేలు చేసేందుకు ఐదు లక్షల వరకూ కొత్త ప్రభుత్వ ఉద్యోగాల హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు రూ 4000 వరకూ భృతి ఇస్తారు. మాదక ద్రవ్య రహిత తమిళనాడు వాగ్దానం చేశారు. ఆసుపత్రుల ఆధునీకరణ, వార్షికంగా ఉచిత వైద్య పరీక్షలు , రూ 25 లక్షల వరకూ కుటుంబ ఆరోగ్య బీమా పథకం గురించి కూడా హామీలు వెలువరించారు. ఇక ప్రజలకు ఎక్కువగా ఇంటివద్దకే నేరుగా రేషన్ పంపిణీ సేవల పథకాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం సృష్టించేందుకు ఖచ్చితమైన గ్యారంటీ కల్పిస్తూ దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే బిజినెస్ లైసెన్స్‌లు ఇచ్చేందుకు చర్యల గురించి కూడా విజయ్ పార్టీ ముందుకు వచ్చింది.














