
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అనుమతి లేని లే ఔట్లను (ఎల్‌ఆర్‌ఎస్ స్కీం కింద) రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు, చార్జీల్లో 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. మే01 వ తేదీ నుంచి 31 జూలై వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ బుధవారం జీఓ ఎంఎస్ నెం.131 జారీచేశారు. గతంలో సుమారు 6లక్షలకుపైగా దరఖాస్తుదారులు ఫీజు చెల్లించినా 2లక్షల మందికి మాత్రమే ప్రొసిడింగ్స్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 26.15లక్షల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు రాగా,
6.04లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. 20.11లక్షల దరఖాస్తులకు సంబంధించి ఫీజు చెల్లించాలని అధికారులు లేఖలు పంపించారు. ఇప్పటి వరకు 6.26 లక్షల మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. వీటిలో సుమారు 2లక్షల మందికి అధికారులు ప్రొసిడింగ్స్ జారీచేశారు. లే ఔట్ రెగ్యులరైజ్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్)కు ఆశించిన స్థాయిలో స్పందలేదు. కానీ, భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. వాటి ద్వారా ప్రభుత్వం రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనావేసింది. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్దంగా నాలుగు నెలల్లో రూ.2వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.












