
జిహెచ్ఎంసీ సహకారంతో ఉప్పల్ డిస్ట్రిక్ట్ బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
నల్లచెరువు డిస్టిక్ బస్టాండ్ సందర్శించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు
ఉప్పల్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో జిహెచ్ఎంసి సహకారంతో ఉప్పల్ డిస్ట్రిక్ట్ బస్టాండ్ అభివృద్ధి దిశగా కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. ఉప్పల్ తిప్పల్ ఎన్నాళ్లీ అవస్థలు మన తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తపై ఆర్టీసీ స్పందించింది. వరంగల్ హనుమకొండ డిపో మేనేజర్ల తో పాటు ఇతర అధికారులు సోమవారం ఉదయం ఉప్పల్ డిస్ట్రిక్ట్ నల్లచెరువు బస్టాండ్ ను సందర్శించారు. సమస్యల నేపథ్యంలో బస్టాండ్‌లో ఉన్న లోపాలను గుర్తించి వాటి పరిష్కారానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆర్టీసీ వరంగల్ డిపోకు చెందిన మేనేజర్లు, సంబంధిత అధికారులు ఉప్పల్ పరిధిలోని నల్లచెరువు బస్టాండ్‌ను సందర్శించారు. సందర్శన సందర్భంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి సదుపాయాల స్థితిగతులను అంచనా వేశారు.

అధికారులు మాట్లాడుతూ... బస్టాండ్‌లో ప్రాథమిక సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. తొమ్మిది డిపోల నుండి నిత్యం 400 బస్సులు హైదరాబాద్ కు వచ్చి వెళుతుంటాయి. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆర్ టిసి అధికారులు తెలిపారు. ముఖ్యంగా బస్టాండ్ లో కమాండింగ్ కంట్రోల్ సిస్టం, ప్రయాణికులకు కూర్చునే సౌకర్యాలు, తాగునీటి ఏర్పాట్లు, శౌచాలయాల శుభ్రత, షెల్టర్లు వంటి అంశాల్లో త్వరలోనే అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. అదేవిధంగా, బస్టాండ్ పరిసరాల్లో శుభ్రత, భద్రతా చర్యలను కూడా మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మన తెలంగాణ ప్రచురించిన వార్తల ప్రభావంతో అధికారులు స్పందించి చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.








