మనతెలంగాణ/మెదక్ ప్రతినిధి : నార్సింగి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై అనధికారికంగా వెలిసిన దుకాణాలు, గ్రామ పంచాయతీ స్థలంలో అక్రమంగా నిర్మించి నిర్వహిస్తున్న షెడ్లపై చర్యలకు ఉపక్రమించని అధికారులపై ‘కబ్జాదారులకు అధికారుల అండ?’ శీర్షికన సోమవారంనాడు ‘మన తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనం అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపింది. కథనానికి స్పందించి పంచాయతీ సెక్రెటరీ నోటీసులు జారీ చేయడంపై వారిలో ఆందోళన మొదలైంది. అక్రమ నిర్మాణాలపై కథనాన్ని రాసి, అధికారుల్లో చలనం తీసుకువచ్చిన మన తెలంగాణ పాత్రికేయుడు రాఘవేంద్రపై ఆక్రమణదారులు దాడికి తెగబడ్డారు.సోమవారంనాడు ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్తుండగా కాపుకాసి రాఘవేంద్రను దుర్భాషలాడుతూ కర్రలు, పిడిగుద్దులతో తీవ్రంగా గాయపరిచారు. ఆయన కారును కూడా ధ్వంసం చేశారు. రాఘవేంద్ర మొహం, కుడిభుజంపై తీవ్ర గాయాలయ్యాయి. వారి చెర నుంచి తప్పించుకున్న రాఘవేంద్ర నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. వారు ఆయనను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం రాఘవేంద్ర తనపై దాడిని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాఘవేందర్‌పై దాడి చేసిన వారిలో దండెం యాదగిరి, దండెం రాజేష్, దండెం సందీప్, దండెం లక్ష్మి ఉన్నారు.

నిందితులు మరో విలేకరి సలీం షేక్‌ను కూడా బెదిరించినట్లు గుర్తించారు. మరోవైపు రాఘవేంద్ర సకాలం లో పోలీసులకు ఫోన్ చేసిన స్పందించలేదు.

టియూడబ్లూజే ఖండన...

నిందితులపై చర్యలకు డిమాండ్

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న విలేకరులపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని టియుడబ్ల్యుజే (ఐజెయు) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులకు గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వార్త రాసిన మన తెలంగాణ నార్సింగి విలేకరి రాఘవేందర్‌పై సోమవారం జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ... సంఘం నాయకులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్‌ఐ సృజనకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు డిజి శ్రీనివాస శర్మ, మిన్పూర్ శ్రీనివాస్ లతో పాటు రామాయంపేట, నార్సింగి, మెదక్ మండలాలకు చెందిన పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విలేఖరులపై భౌతిక దాడులను ఎట్టి పరిస్థితుల లోనూ సహించేది లేదని చారి స్పష్టం చేశారు.

నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను కోరారు. బాధితుడికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు ఉన్నతాధికారి, రామాయంపేట సి.ఐ దృష్టికి ఈ ఘటనను తీసుకెళ్లామన్నారు. ఒకవేళ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే జిల్లా వ్యాప్తంగా నిరసనలతో పాటు టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. జర్నలిస్టుల భద్రత విషయంలో అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సత్యనారాయణ, మల్లేశం, రమేష్ గౌడ్, భైరవ రెడ్డి, యాదగిరి, మన తెలంగాణ జిల్లా ప్రతినిధి ఎస్. నర్సింహా చారి, సలీం షేక్, అరుణ్, అనిల్, రాచర్ల నరేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.